Sitaram Yechury: వామపక్ష యోధుడు మరణం.. ప్రముఖుల నివాళులు

Sitaram Yechury: వామపక్ష యోధుడు మరణం.. ప్రముఖుల నివాళులు
X
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ముద్ర వేశారన్న మోదీ... ఏచూరి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్న చంద్రబాబు

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూయడంపై ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీనిపై చాలామంది రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.


మోదీ విచారం

ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపమని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా తనదైన ముద్ర వేశారన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధాని మోదీ.. గతంలో ఏచూరితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసుకున్నారు.

దేశ ఆలోచనకు రక్షకుడు: రాహుల్‌

సీతారాం ఏచూరి మరణం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తనకు మంచి మిత్రుడు, ఆప్తుడన్నారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత ‘ఐడియా ఆఫ్‌ ఇండియా’కు రక్షకుడిగా పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో ఏచూరిది గౌరవస్థానం: చంద్రబాబు

ఏచూరి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజకీయాల్లో ఆయన గౌరవస్థానం పొందారన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి అని కొనియాడారు. అట్టడుగు వర్గాల ప్రజలతో మంచి అనుబంధం ఉన్న నేత అన్నారు. విశాల దృక్పథంతో కూడిన రాజకీయ చర్చలు పార్టీకి అతీతంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు.

తెలుగువారిలో ఏచూరిది ప్రత్యేక స్థానం: సీఎం రేవంత్‌ రెడ్డి

వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి ప్రస్థానం ప్రత్యేకమైనదని సీఎం అభిప్రాయపడ్డారు. నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు.

సీతారాం మరణం బాధాకరం: పవన్ కళ్యాణ్

వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీతారాం ఏచూరి దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సీతారాం కోలుకుంటారని భావించానని తెలిపారు. కాగా రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Tags

Next Story