Polavaram: గైడ్‌బండ్ కుంగిన అంశంపై ఢిల్లీలో వాడీవేడి చర్చ..

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గైడ్‌బండ్ కుంగిన అంశంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ నేతృత్వంలో ఢిల్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణ కోసం నిర్మించిన గైడ్‌బండ్ కుంగిన ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చారా అంటూ ప్రశ్నించారు గజేంద్ర షెకావత్.ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అన్ని కీలక భాగస్వాముల ప్రతినిధులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టులో గైడ్‌బండ్ కుంగిన అంశంలో నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇంతవరకు ఖరారు కాలేదు.ఆ కమిటీ నివేదిక కూడా సమగ్రంగా లేకపోవడంతో అందులోని అంశాలపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. ఈ కారణంగానే నివేదికకు తుది రూపు ఇవ్వడం ఆలస్యమవుతోందని సమాచారం.
డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సహకారంతో కేంద్ర జలసంఘం ఈ ఆకృతులకు ఆమోదం తెలియజేస్తుంది.ఇందులో ఏపీ జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్,వ్యాప్కోస్ ఇలా అనేక విభాగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.పోలవరం ప్రాజెక్టులో ఇంతమంది భాగస్వామ్యం ఉండగా గైడ్‌బండ్ కుంగడం అంటే ఏమనుకోవాలి దీనికి బాధ్యులు ఎవరో స్పష్టంగా తేల్చాలన్నారు కేంద్ర మంత్రి షెకావత్.ఈ అంశంలో కీలక భాగస్వాములందరినీ మంత్రి ప్రశ్నించారు.ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇన్ని సంస్థల మధ్య ఎందుకు సమన్వయం లేదని నిలదీశారు.పోలవరం గైడ్‌బండ్ కుంగడానికి బాధ్యులను తేల్చడంతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలన్నింటినీ అధ్యయనం చేసి వాటిని సరిదిద్దేందుకు కేంద్ర మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు.
ఈ కమిటిలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో పాటు మరికొందరు ఇందులో ఉంటారు.సమావేశానికి పోలవరంలో కీలక భాగస్వామ్య సంస్థలు, రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరంలో ముఖ్య అధికారులు ఉన్నారు.ఈ కమిటీ గైడ్‌బండ్ కుంగడానికి బాధ్యులను తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి లోపాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com