YS Vivekananda Reddy: వివేకా హత్య ప్రదేశంలో దొరికిన లేఖపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు..

YS Vivekananda Reddy: వివేకా హత్య ప్రదేశంలో దొరికిన లేఖపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు..
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సాంకేతిక సాయం తీసుకుంటోంది సీబీఐ.

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సాంకేతిక సాయం తీసుకుంటోంది సీబీఐ. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేఖపై సీబీఐ ప్రత్యేకంగా దర్యాప్తు జరిపింది. వివేకానంద రెడ్డి రాసిన లేఖను సెంట్రల్ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు సీబీఐ అధికారులు. లేఖలో రాసిన రాతను బట్టి.. సదరు వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో రాసి ఉంటారో ఈ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో విశ్లేషిస్తారు.

ఆ లేఖలో రాతపై సైకలాజికల్ అనాలసిస్‌ చేసిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌.. సంచలన విషయాలు వెల్లడించింది. వివేకానందరెడ్డి తన అభీష్టానికి విరుద్ధంగా ఆ లేఖ రాసినట్టు ఉందని ఫోరెన్సిక్ ల్యాబ్ తెలిపింది. మెదడుకి, చేతికి సమన్వయం లోపించిన విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఆయన్ను కొడుతూ లెటర్‌ రాయించినట్టే ఉందని, తీవ్రమైన ఒత్తిడి మధ్య లేఖ రాసినట్లు ఉందని తెలిపింది.

వివేకానందరెడ్డి రాసిన లేఖ సొంతంగా రాసినట్లైతే లేదన్నది ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్. తీవ్రమైన బలప్రయోగం మధ్య లెటర్ రాశారని, వణుకుతూ రాసినట్టుగా ఉన్న చేతిరాతను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోందని రిపోర్టులో తెలిపింది. ముఖ్యంగా అక్షరాలు ఒకే లైన్లో లేకపోవడం, ఒకచోట ఒత్తిపట్టి రాసినట్టు ఉండి మరోచోట రాయలేనంత పరిస్థితిలో ఉండి రాసినట్టు ఉందని రిపోర్ట్‌ తేల్చింది.

పైగా అక్షరాలు చిన్నగా, పెద్దగా రాయడాన్ని విశ్లేషిస్తే.. పెన్నుకి, మెదడుకి మధ్య సమన్వయం లేనట్టుగా ఉందని తెలిపింది. ఓవైపు దాడి చేస్తూనే లెటర్‌ రాయించడం వల్ల సంతకంలోనూ తేడా వచ్చిందని రిపోర్ట్‌ తెలిపింది. వివేకానందరెడ్డి గత సంతకాలతో పోల్చి చూసినప్పుడు.. ఆఖరి లేఖలోని సంతకం చాలా భిన్నంగా కనిపిస్తోందని తేల్చారు.

సాధారణంగా ముందు ఇంటి పేరు రాసి తరువాత తన పేరును సంతకంగా పెట్టే వివేకానంద రెడ్డి.. ఆ లేఖలో మాత్రం కేవలం వివేకానందరెడ్డి అని మాత్రమే రాశారని చెప్పుకొచ్చారు. పైగా ఆ సంతకం కూడా అస్పష్టంగానే ఉందని, స్పృహ లేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని రిపోర్ట్‌లో తెలిపింది. వివేకా హత్య రోజు డెడ్‌బాడీ దగ్గర ఓ లెటర్‌ కనిపించింది.

ఇందులో డ్రైవర్‌ ప్రసాద్‌ తనపై దాడి చేశాడని రాశారు. డ్యూటీకి తొందరగా రమ్మన్నందుకు డ్రైవర్‌ ప్రసాద్‌ తనను చచ్చేలా కొట్టాడని, ఈ లేఖ రాయటానికి కూడా చాలా కష్టమైందని, డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని రాశారు. అయితే, ఆ లేఖ రాసినప్పుడు వివేకానందరెడ్డి స్వేచ్ఛగా లేరని, తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి మధ్య ఉన్నారంటూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చింది. లేఖ కూడా అసంపూర్తిగా ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Tags

Read MoreRead Less
Next Story