Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మంది అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం..

Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మంది అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం..
Amalapuram: గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

Amalapuram: గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు మరో 20మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరితో కలిసి ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 91కి చేరింది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా.. ఊరుకునేదిలేదన్నారు. అమలాపురంలో అల్లర్లు జరిగిన రోజునుంచి ఇప్పటివరకు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు.

కోనసీమలోని 8మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన అమలాపురం, అంబాజిపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేటతోపాటు.. రావులపాలెం, ముమ్మడివరం మండలాల్లో ఈనెల 4 వ తేదీ వరకు ఇంటర్‌ నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అపోహలు, వివాదాస్పదమైన మెసేజ్‌లు జనాల్లో ఉద్రిక్తలకు దారితీసే ప్రమాదం ఉండటంతో ఈ చర్యలు చేపట్టారు.

అయితే కోనసీమ అల్లర్ల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి.. వైసీపీ ఎంపీటీసీపై మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరిస్తున్నట్లుగా ఆడియో ఒకటి కలకలం రేపుతోంది.. అసభ్య పదజాలంతో ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరిస్తున్న ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.. రెండు కాళ్లు విరిచేస్తా, అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు..

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్‌ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో అల్లర్లు జరిగాయి.. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు.. ఈ అల్లర్లకు సంబంధించి వైసీపీ ఎంపీటీసీ సత్తిబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా ఎంపీటీసీకి మంత్రి తనయుడు ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

కోనసీమ జిల్లా పేరు మార్పుతీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సాధారణంగా ధర్నా.. రాస్తారోకోలు నిర్వహిస్తారనుకున్న పోలీసులు, ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఉన్నట్టుండి ఆరోజు నిరసన కారులు రెచ్చిపోయి వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌ బాబుఇళ్లకు నిప్పుపెట్టి నానా బీభత్సం సృష్టించారు. ఒకానొక దశలో పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. జిల్లాలో కర్ఫ్యూ విధించాల్సివచ్చింది. అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. అమలాపురం రణరంగంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story