టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసు నోటీసుల కలకలం

టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసు నోటీసుల కలకలం
టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ డివిజనల్..

టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి నుంచి చంద్రబాబుకు నోటీసులు వెళ్లాయి.. పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్‌ మృతికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వాలంటూ తాజాగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఆగస్టు 27న దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు. మీ దగ్గరున్న సమాచారం, సాక్ష్యాధారాలు అందజేయాలని కోరారు. నోటీసు అందిన వారం రోజుల్లోపు తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని మదనపల్లి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి నోటీసులు పంపారు.

పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్‌ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 26న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. వైసీపీ నేతలు బెదిరింపుల వల్లే ఓం ప్రతాప్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఓం ప్రతాప్‌ ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ తనిఖీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.. మదనపల్లెలో ఆటో నడుపుతూ ప్రతాప్‌ జీవనం సాగించేవాడని.. అతను సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని.. దళితులపై దాడులు విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, పోలీసులు కలిసి దళితులపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందుకే వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. దోషుల్ని పట్టుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం ద్వారా ప్రజల్లో శాంతిభద్రతల పట్ల విశ్వాసం పునరుద్ధరించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు లేఖ అంశాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెబుతూనే.. ఆయనకు నోటీసు పంపుతామని చెప్పారు.. ఈ నేపథ్యంలోనే మదనపల్లి ఎస్‌పీడీవో నుంచి సీఆర్పీసీ సెక్షన్‌ 91 కింద చంద్రబాబుకు నోటీసులు వెళ్లాయి.

చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేయాలని కోరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని లేఖ రాయడం తప్పా అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు నోటీసులు ఇచ్చిన ఉదందం ఎక్కడైనా ఉందా ఆన్నారు. రాష్ట్రంలో వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాంతంత్య్రాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. నోటీసు ద్వారా విపక్షాలకు కళ్లెం వేయాలనుకోవడం జరగని పని అన్నారు. ఈ కేసులో విచారణ చేసి దోషుల్ని పట్టుకుని శిక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని యనమల అన్నారు.. ఓం ప్రతాప్ మృతి వ్యవహారంలో ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆధారాలు కావాలంటూ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story