Police Notice: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసుల నోటీసులు..

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పలువురు టీడీపీ నేతలను, వారి వారి కుటుంబాల పట్ల సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారనే దానిపై ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. వీరు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి వారి ఇళ్లకు నోటీసులు అంటించారు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి సొంత గ్రామమైన అంబకపల్లెలోని నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పలువులు వైసీపీ కార్యకర్తలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరవ్వాలని నోటీసులు పేర్కొన్నట్లు సమాచారం.
మరోవైపు.. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది.. తప్పుడు కేసులు బనాయించి భయపెడుతున్నారని.. అరెస్ట్‌లు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతుల మండిపడుతున్నారు. మరోవైపు.. కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ పీఏ రాఘవరెడ్డి.. అయితే, రాఘవరెడ్డి పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.. కాగా, గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పీఏ రాఘవరెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com