Chittoor : నగరిలో సీఎం సభ, పోలీసుల అత్యుత్సాహం, ఆకలికేకలు

Andhra Pradesh ( Nagari ) : సీఎం జగన్ ( Jagan) పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి రోజా ( Roja Selvamani ) ఫోటోలు లేకుండానే ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల ఇన్‌చార్జ్‌లు సీఎంకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే ఇందులో ఎక్కడ కూడా మంత్రి రోజా ఫోటోలు కనిపించడం లేదు. వడమాల పేట వైసీపీ ఇన్‌చార్జ్ మురళీ, పుత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్ అమ్ములు, నగరి వైసీపీ ఇన్‌చార్జ్ కేజే కుమార్, కేజే శాంతి, నిండ్ర మండల వైసీపీ ఇన్‌చార్జ్ చక్రపాణిరెడ్డిలు కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే ఆ ఫ్లెక్సీలలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. స్ధానిక ఎమ్మెల్యే రోజా ఫోటో మాత్రం ఎక్కడా కనిపించడంలేదు.
మరోవైపు మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరుగుతున్న నేపథ్యంలో జనసమీకరణకు దూరంగా ఉన్నారు ఐదు మండలాల వైసీపీ ఇన్‌చార్జ్‌లు. దీంతో మంత్రి రోజాకు జనసమీకరణ తలనొప్పిగా మారింది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సభకు హాజరుకావాలని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి మహిళలను సభకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు సభకు వచ్చేది లేదని చెప్పడంతో బస్సులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నగరి, పుత్తూరు డిపోలకు చెందిన బస్సులేకాకుండా కడప జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో జనాలను బలవంతంగా తరలిస్తున్నారు. 50కి పైగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు చెందిన వ్యాన్లను మంత్రి రోజా అనుచరులు బలవంతంగా లాక్కున్నారు.
పోలీసుల అత్యుత్సాహం
సీఎం టూర్ నేపథ్యంలో నగరిలో ( Nagari ) ఆంక్షలు విధించారు. రెండు కిలోమీటర్ల మేర షాపులను మూసివేయించారు. సాయిబాబా ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కడ కూడా షాపులను తెరవనివ్వలేదు. సుమారు కోటిన్నరకు పైగా ప్రజాధనం వృధా అయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక సభా మైదానంలోకి నల్లదుస్తులతో వచ్చినవారికి పర్మిషన్ లేదంటూ వెనక్కి పంపారు. బుర్కాతో వచ్చిన మహిళలను సైతం అనమతించడం లేదు. విద్యాశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగి బుర్కా ఉందని వెనక్కి పంపారు పోలీసులు.
ఆకలి కేకలు
సీఎం నగరి పర్యటనలో పోలీసులు తిప్పలు పడుతున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు అల్పాహారం అందించే నాథుడు కరువయ్యారు. జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆహారం కోసం పోలీసులు సిబ్బంది అల్లాడిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com