చంద్రబాబు చిత్తూరు పర్యటనకు నో పర్మిషన్.. పోలీసుల హైడ్రామా!
మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకల్ని నిరసిస్తూ... చిత్తూరు, తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు జారీ చేశారు. కొవిడ్ రూల్స్, ఎలక్షన్ కోడ్ దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వెల్లడించారు. ఇవాళ చిత్తూరు, తిరుపతిలోని గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలో... పోలీసులు అర్ధరాత్రి హైడ్రామాకు తెరతీశారు. అనుమతి కోరుతూ టీడీపీ నేతలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు.
పురపోరులో అధికార పార్టీ నేతల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిత్తూరు, తిరుపతిలోని గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఐదు వేల మందితో చేపట్టనున్న ధర్నాకు అనుమతించాలని టీడీపీ నేతలు పోలీసులకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుపై అర్ధరాత్రి స్పందించిన చిత్తూరు, తిరుపతి డీఎస్పీలు... ధర్నాతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని నోటీసు జారీ చేశారు. వేలమందితో ర్యాలీలు, నిరసనలకు అనుమతి ఇవ్వలేమని నోటీసుల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను తిరుపతి విమానశ్రయంలోనే అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు... పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనుమతి లేకపోయినా నిరసన చేపట్టి తీరుతామని స్పష్టంచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com