దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల

chintamaneni prabhakar: న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు చింతమనేని. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 3 మండలాల ఎస్సై లు తనపై కేసులు నమోదు చేశారన్నారు. పెదవేగి మండలo ఎస్సై కేసు ఎప్పుడు పెడతాడో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం లో గంజాయి గురించి ప్రశ్నించి 151 నోటీసు ఇచ్చారన్నారు.
ప్రశ్నించింది గంజాయి గురించి అయితే 151 నోటీసులో మాత్రం వేరేలా ఉందన్నారు. జగన్ మాత్రం ఆయన కేసులపై డిశ్చార్జి పిటిషన్ వేస్తారని, తనపై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కే నా కుటుంబం ఉంది నాకు కుటుంబం లేదా? అంటూ ప్రశ్నించారు చింతమనేని. పోలీసులతో తనకు ప్రమాదం ఉంది తప్ప నక్సల్స్ తో ప్రమాదం లేదన్నారు. తన అరెస్ట్ లో కుట్ర కోణం ఉందన్నారు.
పెట్రోలుధరల పెంపును నిరసిస్తూ.. ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించిన చింతమనేనిపై దెందులూరులో కేసు నమోదైంది. పోలీసుల విధులకు మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగించారంటూ..ఆరోపణలు వచ్చాయి. చింతమనేని నిన్న విశాఖ జిల్లాలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను అదుపులో తీసుకుని...రాత్రంతా చింతపల్లిలోనే ఉంచారు. చింతమనేని అరెస్ట్‌తో పశ్చిమగోదావరి జిల్లా మొత్తం అట్టుడికిపోయింది.
ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. దీంతో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు దుగ్గిరాలలోని చింతమనేని ఇంటి వద్దకు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించినప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రావడం లేదు. చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com