Ap News: శనగపప్పు అక్రమాల గుట్టు రట్టు

విజయవాడ కేంద్రంగా శనగపప్పు అక్రమాల ముఠా గుట్టు రట్టయింది. బహిరంగ మార్కెట్‌లో కిలో 74 రూపాయలకు విక్రయిస్తున్న శనగపప్పును కేంద్ర ప్రభుత్వం రాయితీపై భారత్ దాల్ పేరుతో 54 రూపాయలకే ఇస్తోంది. కిలోల ప్యాకెట్లలో వస్తున్న వాటిని చింపేసి.. 10, 20 కిలోల బస్తాల్లో పోసి సాధారణ శనగపప్పు ధరకు అమ్మేస్తున్నారు. ఇలా నిత్యం వేల కిలోల పప్పును చుట్టుపక్కల ఉండే జిల్లాలన్నింటికీ తరలిస్తున్నట్టు తెలిసింది.
తాజాగా ఈ ముఠా కార్యకలాపాలపై దృష్టిపెట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మార్కెట్లలో సోదాలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ సిబ్బంది కూడా ఈ శనగపప్పు అమ్మకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భవానీపురంలో ఆకుల రాజేశ్వరరావు వీధిలోని శైలజా దాల్ మిల్‌పై ఈ నెల 12న విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు కలిసి దాడులు చేశారు. ప్రభుత్వ రాయితీ పప్పు 29 వేల 310 కిలోలను అక్రమంగా నిలువ ఉంచినట్టు గుర్తించారు. దీని విలువ ప్రభుత్వ నిర్ణయించిన కిలోకు 60 రూపాయల ప్రకారం చూస్తే.. 17 లక్షల 58 వేలు. కానీ.. దీనిని కిలోకు 10 నుంచి 15 రూపాయలు అధిక ధరకు వేసి విక్రయిస్తున్నారు. ఇలా ఒక టన్నుకు 15 వేలకు పైగా లాభానికి అమ్ముకుంటూ లక్షల్లో దండుకుంటున్నారు.
శనగపప్పు బస్తాలపై నంబర్ వన్ క్వాలిటీ, బెస్ట్ గ్రేడ్ అంటూ ముద్రించి... మార్కెట్లోకి తరలించి అమ్ముతున్నారు. వాస్తవంగా ఇది గ్రేడ్ వన్ పప్పు కాదు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇచ్చేది కావడంతో రేషన్ బియ్యం మాదిరిగానే నాణ్యత తక్కువ ఉంటుంది. విజయవాడ దుర్గగుడి లాంటి పెద్ద ఆలయాలకు సైతం ఈ పప్పునే నంబర్ వన్ క్వాలిటీ పేరుతో ఇస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గగుడిలో టెండర్ ధర ప్రకారం కిలోకు 66 రూపాయలు చెల్లిస్తున్నారు. గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లోనూ ఈ పప్పునే బస్తాల్లో పోసేసి.. అధిక ధరలకు కొందరు వ్యాపారులు అమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్దిరోజులుగా అధికారులు గొల్లపూడి మార్కెట్‌లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక.. ఓ ప్రధాన డీలర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. దొంగ బిల్లులు సృష్టించి మరీ ప్రభుత్వ గోదాము నుంచి తెచ్చి అమ్మేసుకుంటున్నట్లు సమాచారం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com