VOA Nagalakshmi: నాగలక్ష్మి కేసులో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు..

VOA Nagalakshmi: విధి నిర్వహణలో వేధింపులు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించినా.. న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న గరికపాటి నాగలక్ష్మి కేసులో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బందరు తాలూకా SI, బందరు రూరల్ CI లపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అలాగే కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై సరైన పర్యవేక్షణ లేని కారణంగా బందరు డీఎస్పీ మాసుం భాషాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమస్యతో వచ్చిన బాధితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏ స్థాయి సిబ్బంది పైన అయినా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
గరికపాటి నాగలక్ష్మి బందరు రూరల్ మండలం భోగిరెడ్డిపల్లిలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు బుక్ కీపర్‌గా వ్యవహరిస్తున్నారు. రుణం మంజూరు విషయంలో.. స్వయం సహాయక సంఘం సభ్యురాలైన గరికపాటి నాగమణితో నాగలక్ష్మికి గొడవ జరిగింది. ఈ వివాదంలో నాగమణి భర్త గరికపాటి నరసింహారావు తలదూర్చాడు.
సంఘం ఖర్చుల వివరాలపై నాగమణి భర్త నరసింహారావు.. వీవోఏ నాగలక్ష్మితో గొడవపడ్డాడు. నాగలక్ష్మితో గొడవపడుతూ, బూతులు తిడుతూ, ఆమె గురించి అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 23న గరికపాటి నరసింహారావు.. వెలుగు ఆఫీసుకు వచ్చి మరీ తిట్టడంతో మచిలీపట్నం తాలూకా పోలీసుస్టేషన్‌లో నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. అయినా సరే నరసింహారావు వేధింపులు ఆపకపోవడంతో ఈ నెల 14న మరోసారి స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
బందరు రూరల్ సీఐ, ఎస్సైలకు తన కంప్లైంట్ కాపీని సైతం పంపారు. పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేసుకున్నారు గాని, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ ధైర్యంతో గరికపాటి నరసింహారావు మరింత రెచ్చిపోయాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేకపోయిన నాగలక్ష్మి.. పురుగుల మందు తాగారు. నాగలక్ష్మి చనిపోవడంతో ఆమె కుమారుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అప్పుడు గానీ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. నాగలక్ష్మి బలవన్మరణం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన వ్యక్తే వేధిస్తున్నాడని పోలీసులకు మొరపెట్టుకున్నా.. జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని, దాని ఫలితంగానే VOA నాగలక్ష్మి ప్రాణాలు తీసుకుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగలక్ష్మిది ఆత్మహత్య కాదు.. వైసీపీ నేత చేసిన హత్య అంటూ మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి ఉంటే నాగలక్ష్మి బలవన్మరణానికి పాల్పడేది కాదన్నారు. చివరికి ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైసీపీ నేత నుంచి ఓ మహిళను రక్షించలేకపోయారంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో తెలుస్తోందని విరుచుకుపడ్డారు నారా లోకేష్.
వైసీపీ నేతలు కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు బహిరంగలేఖ రాశారు. ఈ మూడేళ్లలో మహిళలపై 1500లకు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
దిశా చట్టం కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా అని నిలదీశారు. విపక్ష నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు, సహచర ఉద్యోగులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో చివరకు జిల్లా ఎస్పీ ఈ కేసులో స్పందించారు. నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com