Political : బాబు, పవన్ లు కలిస్తే.. పొలిటికల్ సునామీనే

Political : బాబు, పవన్ లు కలిస్తే.. పొలిటికల్ సునామీనే
శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్.. వాళ్లు కలిస్తే సునామీనే మరి..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలను అంతగా ప్రభావితం చేస్తుందా ? ఎందుకు కలిశారు ? ఎలా కలుస్తారు ? టీడీపీతో కలిసి కాపులకు అన్యాయం చేస్తారా ? వైసీపీ మంత్రులు ఇలా గగ్గోలు పెట్టడానికి కారణమేంటి ? వారిద్దరూ కలిస్తే మీకు పైనా కింద తడిచిపోతోందా ? అయితే డైపర్లు వాడండి అని టీడీపీ, జనసే నేతలు ఎందుకంటున్నారు ? నిజంగా ఆ రెండు పార్టీల కలయికతో వైసీపీ సర్కారుకు ఎగ్జిట్ బోర్డు చూపించనట్లేనా ? ఎటు చూసినా ఏపీ లో ఇదే చర్చ..



నిజమే రెండు పార్టీల అగ్రనేతలు కలిసి కాఫీ తాగితే తుఫానేమీ రాదు. కానీ టీడీపీ, జనసేన పొత్తు ఏపీలో పొలిటికల్ సునామీ స్రష్టించబోతోందనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇదేదో రెండు కులాల ఓట్లు కలిసిపోతాయనో, లేదా బాబుకి పవన్ ధైర్యం, పవన్ కు బాబు తోడ్పాటు అనే మామూలు మాటలు కూడా కాదు. పక్కా లెక్కలే. ఎన్నికల్లో ఎవరికి ఓట్లెక్కువొస్తే వాళ్లే గెలిచినట్లు.. గెలిచిన వాళ్ళకి ఎంత శాతం ఓట్లు వచ్చాయనే లెక్క కాదు. ఈ లెక్కల మంత్రాంగాన్ని పరిశీలిస్తే ఏపీలో టీడీపీ, జనసేన ఓట్లు కలిస్తే వైసీపీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి గోడమీద రాతలా స్పష్టంగా కనిపిస్తోంది.



2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన లకు వచ్చిన ఓట్లను ప్రాతిపదికగా తీసుకున్నా అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మరి విధ్వంసం తప్ప వికాసం లేని తన పాలన తర్వాత జరిగే ఎన్నికల్లో ఇంకెలా ఉంటుంది. ఏపీలో పరిస్థితులను ఆకళింపు చేసుకున్న వారికెవరికైనా ఇట్టే అర్దమవుతుంది. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా తర్వలోనే నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకోబోతున్నారు. ఏం సాధించారని చూస్తే రాజకీయ పార్టీలను , ప్రజలను పీడించడం తప్ప ఇంకేమీ కనిపించదు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలనయధేచ్చగా కొనసాగుతోంది.



దేశంలో బహుశా ఏ రాష్ట్రంలోను ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో అడ్డగోలు, అసమంజస నిర్ణయాలు తీసుకుని ఉండరేమో. ఒక రకంగా ఆ నైజమే జగన్ ను ఒక ప్రత్యేక రాజకీయ నేతగా వేరు చేసి చూపుతోంది . ధ్యైరంగా జనంలో కి వెళ్ళి ఓట్లడిగే పరిస్థితి లేదనేది వైసీపీ నేతలకు ఇప్పటికే తేటతెల్లమవుతోంది. గడప గడప తొక్కుతుంటే వస్తున్న రియాక్షన్ వారికి అర్దమవుతోంది. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలుగా చేసి ఉన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను కూడా చూశారు. చాలామందికి జగన్ తత్వం బోధపడ్డా చేయగలిగిందేమీ లేదనే నిస్సహాయ స్థితిలో ఉన్నారు.



ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు ఇక్కడ వేగలేమనుకుని పార్టీ నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఈసారి మేం పోటీచేయలేమంటూ జగన్ కు చెప్పేస్తున్నారు. కొంతమంది ఈసారి సీటు మార్చి ప్రయత్నం చేద్దామనే ఆలోచనకొచ్చారు.ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన కలిసి రంగంలోకి దిగితే చేయడానికి యుద్దం కూడా మిగలదని భయపడుతున్నారు. ఎందుకంటే 2019లో ఎవరికి వారుగా పోటీచేసినప్పుడే ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఓట్ల చీలికే వైసీపీకి వరమైంది.



ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయగా జనసేన వామపక్షాలు కలిసి బరిలోకి దిగాయి. వైసీపీకి రాష్ఠ్రవ్యాప్తంగా దాదాపు 50 శాతం, టీడీపీకి 40 శాతం జనసేనకు 6 శాతం ఓట్ షేర్ దక్కింది. అయితే ఇది రాష్ట్రం మొత్తం మీద వచ్చిన యావరేజ్. రాయలసీమలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ వైసీపీకి ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. పేరుకు అప్పడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా వైసీపీకి యంత్రాంగం చాలా సహకారం అందించింది. కేంద్ర ప్రభుత్వం అండ కూడా తోడవడంతో అప్పడు వర్గ పరంగా ఆధిప్యతం ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది.



ఆప్రాంతాల్లో 55 శాతానికి మించి కూడా ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే పెద్ద మార్పు కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లో 2019లో వైసీపీ ఓటు షేర్ ఆయా జిల్లాలను బట్టి 40 నుంచి 42 శాతం మధ్య, టీడీపీ ఓటు షేర్ దాదాపుగా 36 నుంచి 40 శాతం వరకు, జనసేనకు 10 నుంచి 23 శాతం వరకు కనిపించింది. ప్రత్యేకించి గోదావరి జిల్లాలను తీసుకుంటే అక్కడ జనసేన ప్రభావం చాలా ఎక్కువ. విశాఖ, క్రుష్ణా, గుంటూరు జిల్లాల్లోను ప్రభావం బాగా ఉంది. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన విడిగా పోటీచేయడం వైసీపీకి పూర్తిగా లాభించింది.



వైసీపీ 40 శాతం ఓట్లతో గెలిచిన సీట్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే విజయవాడ వెస్ట్ లో కేవలం 38 శాతం ఓట్లే వచ్చిన వైసీపీకి విజయం దక్కింది. కారణం ఓట్ల చీలికే. గోదావరి జిల్లాల్లో లెక్కలు చూస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ కేవలం 40 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిచింది. ఇక్కడ టీడీపీ, జనసేనలకు కలపి వచ్చిన ఓట్ల శాతం ఎంతో తెలుసా ? అక్షరాలా 56 శాతం. కాకినాడ సిటీలో వైసీపీ 43 శాతం ఓట్ల తో విజయంసాధిస్తే టీడీపీ, జనసేనలకు కలిపి వచ్చిన ఓట్లు 53 శాతం.. కోనసీమ ప్రాంతమైన పి. గన్నవరంలో వైసీపీ 43 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిస్తే టీడీపీ, జనసేనలకు పోలయిన ఓట్ల శాతం 52 శాతం.. పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో చూద్దామనుకున్నా అక్కడ ఇంతకు మించి.



తణుకులో ప్రస్తుతం మంత్రిగా ఉన్న వైసీపీ అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు కేవలం 43 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిచారు. ఇక్కడ టీడీపీ, జనసేనలకు కలిపి వచ్చిన ఓట్లు 57 శాతం. ఏలూరులో వైసీపీ 44 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిస్తే టీడీపీ, జనసేనలకు వచ్చిన ఓట్లు దాదాపు 53 శాతం. నర్సాపురంలో అయితే వైసీపీ 40 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధిస్తే టీడీపీ, జనసేనలు కలిపి 56 శాతం ఓట్లు సాధించాయి. దీన్ని బట్టి అర్ధం కాలేదా ... గోదావరి జిల్లాల్లో రెండు పార్టీలు కలిస్తే 2019లోనే వైసీపీ అడ్రసు గల్లంతయ్యేదని.



ఇక క్రుష్ణా జిల్లాలో ను ఇటువంటి పరిస్థితే.. విజయవాడ సెంట్రల్‌ లో వైసీపీ అభ్యర్ధి కేవలం 40 శాతం ఒట్లు తెచ్చుకుని బయటపడ్డారు. ఇక్కడ టీడీపీ ,జనసేన మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్ధికి కి కలిపి వచ్చిన ఓట్లు 56 శాతానికి పైనే. విజయవాడ వెస్ట్ లో కేవలం 38 శాతం ఓట్లు లభించినా వైసీపీ గెలిచింది. ఇక్కడా అదే కథ.. టీడీపీ, జనసేనలకు కలిపి దాదాపు 50 శాతం ఓట్లు దక్కాయి. అటు విశాఖలో లోక్ సభ స్థానంలో వైసీపీ కేవలం 35 శాతం ఒట్లు తెచ్చుకున్నా గెలవగలిగింది. అక్కడ టీడీపీ, జనసేన లకు కలిపి దాదాపు 60 శాతం ఓట్లు వచ్చాయి. అనకాపల్లి లో ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పై ఎగిరెగిరిపడుతున్న మంత్రి గుడివాడ అమరనాథ్ కూడా టీడీపీ, జనసేన కలిస్తే గల్లంతయ్యే వారే....



ఇక శ్రీకాకుళం సీటులో మంత్రి ధర్మాన ప్రసాదరావు కంటే టీడీపీ, జనసేనలు కలిపి తెచ్చుకున్న ఓట్లే ఎక్కువ. పవన్ కల్యాణ్ పోటీచేసి ఓడిపోయిన గాజువాక, భీమవరం లోను ఇటువంటి సీన్లే... గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ 45.88 శాతం ఓట్లతో గెలిస్తే అక్కడ టీడీపీ,జనసేనలకు కలిపి 52 శాతం ఓట్లు దక్కాయి. చివరికి వైసీపీ ఎదురే లేదని చెప్పుకునే నెల్లూరు సిటీలోను గెలిచిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వచ్చిన ఓట్ల కంటే టీడీపీ, జనసేనలకు కలిపి వచ్చిన ఓట్లే ఎక్కువ.



తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి భూమన కరుణాకరరెడ్డి 44.64 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిస్తే ఇక్కడ టీడీపీ, జనసేనలకు కలిపి 53 శాతం ఓట్లు వచ్చాయిఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు టీడీపీ, జనసేన లపొత్తు సూపర్ హిట్. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుతో బరిలోకి దిగితే తమకు దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుందనేదే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫ్రస్టే షన్. అసలు ఎవరు ఎవరితో కలిసినా కలవకున్నా ఈ సారి వైసీపీ ని ఓడించడానికి జనం సిద్దమయ్యరనేది ఒక వాస్తవం. ఏదో దింపుడు కళ్ళం ఆశతో వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ లను సింగిల్ గా పోటీచేయండంటూ పిచ్చి సవాళ్ళు విసిరారు. తాజా జరిగిన చంద్రబాబు, పవన్ ల భేటీ తో రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందనేదానికి సంకేతంగా చూడొచ్చు. సైకిల్, గ్లాసు కలిస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీలో గెలిచే అభ్యర్ధులను వేళ్ల మీద లెక్కపెట్టాల్సి రావచ్చు.

రావిపాటి

Tags

Read MoreRead Less
Next Story