Minister Lokesh : 100 రోజుల్లో మంగళగిరిలో గుంతలు లేని రోడ్లు

అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్‌ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు.
ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్ ను అధికారులు స్వీకరించాలన్నారు. వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్‌ను తాము స్వీకరిస్తున్నామని, స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1 తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com