Power star: జనసేనానికి విజయ్ కాంత్ అనుభవపాఠం...

Hyderabad
Power star: జనసేనానికి విజయ్ కాంత్ అనుభవపాఠం...
ఒక్క ఎమ్మెల్యే వున్న డీఎండీకే ఐదేళ్లలో ప్రధాన ప్రతిపక్షం ఎలా అయింది? ఓట్లు సరే సీట్లు రాకపోతే పార్టీ నిలబడటం అసాధ్యం.... ప్రశ్నించే అవకాశం రావాలన్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం అవసరం...వీరాభిమానులకు తోడు ఎన్నికల అనుభవం ఆవశ్యకం సరైన మిత్ర పక్షాన్ని ఎంచుకోవడమూ కీలకం....




"నా మీటింగులకు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నరు. నేను చెప్పే ప్రతీ మాటా వింటున్నారు కానీ మీ అభిమానం ఓట్లరూపంలో కనపడట్లేదు. ఎక్కడికి పోతుంది ఈ ఆదరణ అన్న అనుమానం కలుగుతుంది" శ్రీకాకులం జిల్లా రణస్ధలంలో జరిగిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న మాటలివి.

2019 ఎన్నికల ఫలితాలను చూసిన పవన్ అనుభవం నుంచి వచ్చిన మాటలివి. ఇదే కాదు తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ సమయంలోనూ ఆయనకు ఈ అనుభవమే ఎదురైంది. అభిమాన హీరోను చూసేందుకు, ఆయన ఉపన్యాసాలు వినేందుకు వీరాభిమానంతో వస్తున్న యువత ఓట్లనాటికి చల్లబడటం, కనీసం ఓట్ల పరంగానైనా స్పందన చూపకపోవడం ఎంత పెద్ద నిరాశకలిగిస్తుందో ఆయనమాటల్లో అర్ధమవుతుంది.

యువతలో విశేష క్రేజ్ వున్న సినీ హీరో పవన్ కళ్యాన్ సభలకీ ఆయనిచ్చే రాజకీయ కార్యక్రమాలకీ పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో మరే పార్టీ నేతకూ లేనంత రెస్పాన్స్ కనిపిస్తుంది. తమ అభిమాన నాయకుడు పవన్ ను ఎవరు ఏమాత్రం విమర్శించినా తట్టుకోలేని అభిమానులు పవన్ కళ్యాణ్ కి లక్షల సంఖ్యలో వున్నారు. అందుకే 2024కి స్వతంగా వెళ్లాలనివున్నా ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందటంకన్నా కలిసికట్టుగా వెళ్లి ఉమ్మడి శత్రువును ఓడించాల్సిన అవసరముందన్నారు.


వాస్తవానికి పవన్ మాటలు వందకు వంద శాతం ఆచరణాత్మకంగా వున్నాయి. మాస్ ప్రజానీకంలో విపరీత అభిమానం పొందుతున్న పలువురు స్టార్స్ రాజకీయాల్లో తమ బలాబలాను అంచనావేసుకోవడంలో తడబడుతుంటారు. మరో పార్టీతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలన్న ఆలోచన వారికి రాదు. కానీ అనుభవం లోకి వస్తే కానీ వాస్తవం బోధపడదు.

తమిళనాడు లెక్కలు - విజయ్ కాంత్ అనుభవ పాఠం.

తమిళనాట డీఎంబీకే పార్టీ అధినేత, తమిళ సినీ అభిమానుల బలం వున్న హీరో కెప్టెన్ విజయ్ కాంత్ ప్రస్దానం చూస్తే రాజకీయాల్లో పొత్తులు ఎంత కీలక భూమిక పోషిస్తాయో అవగతమౌతుంది. 2006లో విజయకాంత్ తన పార్టీ తరఫున మొదటి సారి అసెంబ్లీకి పోటీ చేశారు. మొత్తం 234 అసెంబ్లీస్దానాలుకు పోటీచేయగా విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే కి 8.38శాతం ఓట్లు వచ్చాయి కానీ సీటు మాత్రం కేవలం ఒక్కటంటే ఒక్కటే దక్కింది.


2011 నాటికి అప్పుడు అధికారంలో వున్న డీఎంకే పై ప్రజావ్యతిరేకత వున్నా ఆనుభవజ్ఞుడైన కరుణానిధిని ఓడించేందుకు సరిపోతుందో లేదో అన్న జాగ్రత్తతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తెచ్చిన పొత్తు ప్రతిపాదనను ఆయన ఒడిసి పట్టుకున్నారు. పొత్తులో భాగంగా జయలళిత పార్టీ తో కలిసి రాష్ట్ర వ్యాప్తగా 40 స్ధానాల్లో పోటీ చేసారు. ఎన్నికల్లో 7.89శాతం ఓట్లు సంపాదించారు. కానీ ఈసారి 29 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకున్నారు. అప్పటి అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా డీఎండీకే ఆవిర్భవించడంతో ప్రభుత్వంలో చేరకుండా ప్రతిపక్ష పాత్ర ఎంచుకని ప్రధాన ప్రతిపక్షనేత హోదానూ దక్కించుకున్నారు. సుమారు 23 శాతం ఓట్లొచ్చిన డీఎంకీ పార్టీకి 23 స్ధానాల్లోనే విజయం దక్కగా 8శాతం లోపు ఓట్లొచ్చిన విజయ్ కాంత్ పార్టీ మాత్రం 29 స్దానాలు దక్కించుకోవడం పొలిటికల్ ఈక్వేశన్స్ ఎలావుంటాయో స్పష్టం చేస్తుంది.

పవన్ - విజయ్ కాంత్ లమధ్య సారూప్యత చాలావుంది.

పవన్ విజయ్ కాంత్ ఇద్దరూ సినీ నేపధ్యమున్న రాజకీయ నాయకులే. ఇద్దరికీ సినీ హీరోలుగా మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్సే. అభిమానులు పవన్ కళ్యాన్ ని పవర్ స్టార్ అని పిలుచుకుంటే విజయ్ కాంత్ ను కెప్టెన్ అంటారు. ఇద్దరూ స్ధానికంగా బలంగా వున్న రెండు ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగానే స్వంతంగా పార్టీలు స్ధాపించారు. విజయ్ కాంత్ కూడా అంతకు ముందు అనేక సమాజికాంశాలపై అభిప్రాయాల వ్యక్తంచేయడంలోనూ, రాజకీయ ఉపన్యాసాల్లో అభిమానులను ఆకట్టుకునేలా మాట్లాడటంలోనూ మంచి క్రేజ్ వున్న నాయకుడే. అంశాలపై ఉన్నది ఉన్నటు బల్లగుద్ది చెప్పే స్వభావమున్న వ్యక్తులే. కాబట్టి పబ్లిక్ మీటింగుల్లో వీరి ప్రసంగాలకు అత్యధిక స్పందన వస్తుంది. అందువల్ల ఎన్నికల్లో పోటే చేసే విషయంలో తనకంటే దాదాపు దశాబ్ద కాలం ముందే విజయ్ కాంత్ చూసిన అనుభవాలనుంచి పవన్ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఎవరి పొత్తుతో లక్ష్యం సాధ్యం.

ఎవరితో పొత్తు అన్న అంశం కూడా చాలాకీలకం అందులోనూ విజయ్ కాంత్ అనుభవం పవన్ కు ఓ సందేశం. ప్రధాన ప్రతిపక్ష ఏఐఏడీఎంకే తో పొత్తు పెట్టుకున్న విజయ్ కాంత్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేలా 29 అసెంబ్లీ స్ధానాలు దక్కితే .. ఆ తర్వాత 2016 లో బీజేపీతో, వైకో నాయకత్వంలోని ఎండీఎంకే వాంటి మరో చిన్న పార్టీతో పొత్తులకు పోయినప్పుడు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పవన్ కూడా 2019లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పెద్దగా ప్రభావమూ చూపలేకపోయాడు. అందుకే అధికార పార్టీని ఓడించే సత్తా, అందుకు తగిన రాజకీయ అనుభవం, ఎన్నికలను ఎదుర్కొనే వ్యవస్ధ ఉన్న పెద్ద పార్టీ ఉభయులకూ లాభదాయకంగా వుంటుంది. మొదట ఉమ్మడి శత్రువును ఓడించి ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో చేరడం లేదా పవన్ ముందునుంచీ చెప్తున్నట్టు ప్రశ్నించే అవకాశమున్న ప్రతిపక్ష పాత్ర పోషించడమో పవనే నిర్ణయించుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story