AP: నిర్విరామంగా బోట్ల తొలగింపు పనులు

విజయవాడలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న పడవల తొలగింపు ప్రక్రియ రెండు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. బోట్లను తొలగించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 67, 68, 69 గేట్ల వద్ద 4 పడవలు చిక్కుకోగా...ఈ నెల 10న మధ్యాహ్నం నుంచి ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు. పడవలు అధిక బరువు, మధ్యలో 3 లేయర్లలో ఇనుపగడ్డర్లు ఉండటంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది రేయింబవళ్లు శ్రమించాల్సి వస్తోంది. విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం గంటలతరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు. ఇప్పటికి 40 మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోటును ముక్కలు చేయడం దాదాపు పూర్తి చేశారు.
ఇవాళ బోటును రెండు ముక్కలుగా చేసి బయటకు తరలించే ఏర్పాట్లు చేశారు. 40 టన్నులకు పైగా బరువున్న బోటును రెండు ముక్కలు చేయగా.. ఒక్కొక్కటి 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు. నదిలో తేలుతూ 10 టన్నులు బరువు మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు తీసేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. నదిలో 60 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో వాటితో తీయడం సాధ్యపడదని తేల్చారు. ముక్కలు చేసిన బోటు నది లోపల చిక్కుకోకుండా... బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు. దీనికోసం గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన టీమ్‌ను విజయవాడకు రప్పించారు.
తొలుత బ్యారేజీ పైకి భారీ క్రేన్లను తీసుకు వచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి తీస్తారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుంచి భారీ పంటును తీసుకొచ్చి బోటు విడి భాగాలను పంటుపైకి ఎక్కించి బయటకు తరలించేలా ప్రణాళిక వేశారు. అలా సాధ్యపడక పోతే.. కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గేట్ల ద్వారా దిగువకు వెళ్లే నీటి ప్రవాహాన్ని బట్టి దీన్ని అమలు చేయడంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా ఒక పడవను తొలగించి తర్వాత మిగిలిన రెండు భారీ పడవలను బయటకు తీయడంపై దృష్టి సారించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com