అమరావతి ఆర్-5 జోన్‌లో విషాదం..పాము కాటుతో కానిస్టేబుల్ మృతి
అమరావతి ఆర్-5 జోన్‌లో విషాదం నెలకొంది. బందోబస్తుకు వచ్చిన ప్రకాశం జిల్లా దర్శి కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుతో మృతి చెందారు. పవన్ కుమార్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణ అనంతరం పవన్ కుమార్ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. దాంతో పవన్ కుమార్ ఆ పామును పట్టుకుని ఇవతలికి లాగారు. ఆ క్రమంలో పాము చేతిపై కూడా కాటు వేసింది.
ఇతర కానిస్టేబుళ్లు ఆ పామును చంపివేసి, పవన్ కుమార్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. పవన్ కుమార్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పవన్‌కుమార్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. పవన్‌కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com