Ap Employees : మలిదశకు చేరిన ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమం..!

Ap Employees : మలిదశకు చేరిన ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమం..!
Ap Employees : ఉద్యమంలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు జనవరి 30తో ముగిశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమం మలిదశకు చేరుకుంది. నాలుగు సంఘాలతో కూడిన పీఆర్సీ సాధన సమితి.. ఈనెల 24న సమ్మె సైరన్ మోగించింది. ఉద్యమంలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు జనవరి 30తో ముగిశాయి. దీంతో మలిదశ ఉద్యమానికీ సై అన్న ఉద్యోగ సంఘాలు.. సర్కారుతో సమరానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఫిబ్రవరి 3న ఛలో విజయవాడను వేలాది మందితో నిర్వహించడానికి ఉద్యోగ సంఘాల నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ APNGO కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఏర్పాట్లు, ఉద్యోగుల సమీకరణ, ఫిబ్రవరి 7న నిరవధిక సమ్మెపై చర్చించారు. సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.

మంత్రుల కమిటీ అసత్య ప్రచారం చేస్తోందని, ఇది ఆటవిక రాజ్యం కాదని ప్రజాస్వామ్యమని గుర్తించుకోవాలన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు వేయాలని డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సహకరించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని బెదిరించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం.. ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని పీఆర్సీ సాధన సమితి నేతలు హెచ్చరించారు.

మరోవైపు.. పీఆర్సీ ఉద్యమ సమితి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఏడో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యగ సంఘాల నేతలు తెలిపారు. ఇటు విజయనగరం జిల్లా ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని కలిసికట్టుగా వ్యతిరేకించారు. సీఎం జగన్ వెన్నుపోటు కంటే దారుణమైన నమ్మక ద్రోహంతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పీఆర్సీ బిల్లులు ప్రాసెస్‌ చేయని అధికారులకు ఛార్జ్‌ మెమోలు జారీ చేస్తున్నారు ఉన్నతాధికారులు.. 27 మంది డీడీ, ఎస్టీవో, ఏటీవోలకు మెమోలు జారీ అయ్యాయి.. ముగ్గురు డీడీలకు కూడా ఛార్జ్‌ మెమోలు ఇచ్చారు ఉన్నతాధికారులు.. 21 మంది సబ్‌ ట్రెజరీ అధికారులకూ నోటీసులు వెళ్లాయి.. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యం వహించినందుకు మెమోలు జారీ చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో పైకి చర్చించేది లేదంటూనే ఉద్యోగులతో సయోధ్య దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పీఆర్సీ జీవోల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. ఐఆర్‌ రికవరీకి స్వస్తి చెప్పడంతో పాటు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పెంపు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫిట్‌మెంట్‌ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. పీఆర్సీ అంశంలో చేయబోయే మార్పులపై ఉద్యోగులను ఒప్పించే బాధ్యత ఉద్యోగ సంఘాలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. సకలం సమ్మెలోకి వెళ్తున్న వేళ.. పీఆర్సీ పోరుకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెడుతుందా..? పీఆర్సీ జీవోల్లో మార్పులకు కసరత్తు చేస్తున్న సర్కారు నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయా..? లేక ఏపీలో ఉద్యోగుల సమ్మె తప్పదా..? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story