Private Companies in AP: ఏపీ నుంచి తరలిపోతున్న ప్రైవేట్ కంపెనీలు..

Private Companies in AP: ఏపీ నుంచి తరలిపోతున్న ప్రైవేట్ కంపెనీలు..
Private Companies in AP: ఓ వైపు ప్రైవేట్ కంపెనీలు.. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతున్నాయి.

Private Companies in AP: ఓ వైపు ప్రైవేట్ కంపెనీలు.. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతున్నాయి. జగన్ సర్కార్‌ అసమర్థ పాలన కారణంగా ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేటాయించిన ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖ పట్నం నుంచి మరో రాష్ట్రానికి తరలిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.


పెట్రోలియం వర్సిటీని మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా భూమి కేటాయింపు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోది విశాఖపట్నానికి కేటాయించారు. ఐతే భూ సమస్య కారణంగా ఇది వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది.


రాష్ట్ర విభజన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయాలని చట్టంలో పొందు పరిచింది. ఈ మేరకు 2015లో ఏపీలో ఐఐపీఈని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఈ సంస్థ ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో 201 ఎకరాల భూ సేకరణకు సిద్ధమైంది.



కొంత భూమిని సేకరించి భూమి పూజ సైతం నిర్వహించింది. ఐతే శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చేంత వరకు తరగతులను ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజినీరింగ్‌లో 60 సీట్లు ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఇందులో సీట్లు కేటాయిస్తారు.



రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 201 ఎకరాల్లో 145 ఎకరాలకు రైతుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. పట్టా ఉన్న రైతులకు ఎకరాకు 15 లక్షల చొప్పున, పట్టా లేని రైతులకు ఎకరాకు 7 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం 145 ఎకరాలు సేకరించింది. మరో 15 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోని పోరంబోకు కావడంతో మొత్తం 160 ఎకరాల సేకరణ ప్రక్రియ సజావుగానే సాగింది.



ఐతే మరో 20 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తానన్న నష్ట పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖంగానే ఉన్నప్పటికీ..కుటుంబసభ్యుల మధ్య గొడవల కారణంగా ఆ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. మరో 20 ఎకరాలకు సంబంధించిన రైతులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేసు నడుస్తోంది.



ఏళ్లు గడుస్తున్నా భూ వ్యవహారం తేలకపోవడంతో పెట్రోలియం వర్శిటీ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి, సీఎస్‌కు కొద్ది రోజుల కిందట లేఖ రాశారు. ప్రస్తుతం సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట కేటాయించాలని కోరారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర పెట్రోలియం మంత్రి, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అసహనం వ్యక్తి చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వర్సిటీకి సంబంధించిన భూ వివాదం తేల్చకపోతే యూపీ రాయ్‌బరేలిలో ఉన్న యూనివర్సిటీలో విలీనం చేద్దామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్సిటీ అధికారులకు కూడా సమాచారం అందింది.



దీంతో జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జగన్ సర్కార్ చేతకానితనం వల్లే ఏపీకి ఇలాంటి పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నాయి. అటు పరిశ్రమల విషయంలోనూ జగన్‌ సర్కార్ తీరును నేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలాగూ తేలేని వైసీపీ సర్కార్...కనీసం ఉన్నవాటిని సైతం కాపాడుకోలేక పోతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story