AP : ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు.. బోర్డు ఎగ్జామ్ లేనట్టే

ఏపీ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు. ఇంకా కృతికా శుక్లా మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని గుర్తుచేశారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని చెప్పారు. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. 2025-2026 ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతామని చెప్పారు. ఇలా చేయడం వల్ల నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం సులభమవుతుందని అన్నారు. 15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేపెట్టారని తెలిపారు. సిలబస్ సంస్కరణతో పాటు, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు సంబంధించి ప్రతిపాదనలు చేసినట్టుగా చెప్పారు. పరీక్షల్లో మార్కుల కేటాయింపు విధానంలో కూడా సంస్కరణలు తీసుకురానున్నట్టుగా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com