Kakinada : కాకినాడ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. హౌస్ సర్జన్ తన జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశాడు. శ్రీకాకుళానికి చెందిన జగదీశ్ ఆర్‌ఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి .. పీజీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. అతడు మద్యం తాగి ఆర్‌ఎంసీ మెన్స్ హాస్టల్లోకి చొరబడ్డాడు. రాత్రి ఒంటిగంటకు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి, రెండో సంవత్సరం చదువుతున్న పలువురు వైద్య విద్యార్థులను నిద్ర లేపాడు. 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్‌లోకి తీసుకొచ్చి, నిలబడాలని ఆదేశించాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 వరకూ ప్రత్యక్ష నరకం చూపించాడు. వికృత చేష్టలు చేయాలంటూ వేధించాడు. వారిలో ఎదురు తిరిగిన ముగ్గురు జూనియర్లపై చేయి చేసుకున్నాడు. బాధిత విద్యార్థుల్లో పలువురు తమ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో వారు కళాశాల యాజమాన్యానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన మేనేజ్ మెంట్ మద్యం తాగి, హాస్టల్ లోకి చొరబడి ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించిన విద్యార్థిని జగదీశ్‌గా గుర్తించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీకి నివేదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com