AP : ఏపీలో నాలుగురోజుల పాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహ సంస్థ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు.
బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రభావం ఏపీపై కూడా ఉంటుదంటున్నారు. ఈ నెల 13 వరకు అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడుతున్నాయి.. వాతావరణం అనుకూలంగా ఉందంటున్నారు. గత నెలలో ఒక తుఫాన్ ఏర్పడగా.. మరోసారి ఇప్పుడు అల్పపీడనం కొనసాగుతోంది. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీకి వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలంటున్నారు. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయవద్దని.. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల కురుస్తుండటంతో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com