AP: విజయవాడలో మళ్లీ వర్షం

AP: విజయవాడలో మళ్లీ వర్షం
X
అధికారులు, ప్రజల్లో మొదలైన వణుకు... బుడమేరుకు మళ్లీ వరద పెరిగే అవకాశం

విజయవాడ, గుంటూరులో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పూర్తిగా తగ్గింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మరోవైపు వరదలతో ముంపునకు గురైన విజయవాడ ప్రజలను ఆదుకునేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని నగర మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ తెలిపారు. వరద సహాయక చర్యలో భాగంగా నగర కమిషనర్ సూర్య తేజ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 10 తాగు నీటి ట్యాంకర్లు, వరద నీటిని తోడే 9 డీజిల్ ఆయిల్ ట్యాంకర్లను మంగళవారం అధికారులు విజయవాడకు తరలించారు.

తగ్గిన వరద

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర 5.25 లక్షల క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది.

బుడమేరుకు మళ్లీ వరద

భీమవరం, ఉండి పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీలో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాలలో సైతం కొండ వాగులు పొంగుతున్నాయి. పొంగుతున్న కొండవాగులు దాటే ప్రయత్నం చేయవద్దంటూ అధికారుల సూచనలు చేస్తున్నారు. పొంగిన కొండవాగుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొవ్వూరు నియోజకవర్గంలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు అంగన్వాడి సెంటర్లకు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. మళ్లీ వర్షం కురుస్తోందంటేనే విజయవాడ వాసులకు వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు భయపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న మైలవరం, జి.కొండూరు మండలాల్లోని బుడమేరుపై వంతెనలు నిర్మించారు.

Tags

Next Story