Kachidi Fish: 2 చేపలు రూ.4లక్షలు

Kachidi Fish: 2 చేపలు రూ.4లక్షలు
అంతర్వేది తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచ్చిడీ చేపలు

వలలో చిక్కినవి రెండే చేపలు.. అయితేనేం భారీ మొత్తాన్ని ఆర్జించిపెట్టాయి. ఒక్కోటీ ఏకంగా రూ.2 లక్షల ధర పలికాయి. దీంతో ఆ మత్స్యకారుల పంటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో శనివారం 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. అరుదైన ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడతారని మత్స్యకారులు చెప్పారు.

కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు అరుదుగా మత్సకారుల వలలో పడతాయని.. అలాంటప్పుడు వారి పంట పండినట్టే అని అంటున్నారు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారని అంటున్నారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారంలానే విలువ కలిగి ఉంటుందన్నారు. కచ్చిడీ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదని.. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుందన్నారు. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుందని.. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయన్నారు..


Tags

Next Story