Tirumala : తిరుమలలో నీళ్ల కష్టాలు ఎందుకొచ్చాయంటే?

తిరుమలలో ఈ ఏడాది లోటు వర్షపాతం కారణంగా.. కొండపైన 5 ప్రధాన డ్యామ్‌లలో నీటి వనరులు తక్కువ మోతాదులో ఉన్నాయని టీటీడీ తెలిపింది. అంతేకాకుండా.. అక్టోబరు 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వారి ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు, స్థానికులు సహకరించాలని కోరింది.
తిరుమలలో 5 ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు రాబోయే 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. తిరుమలలో రోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉందని.. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్‌ల నుంచి, మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సేకరిస్తోంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం జలాశయాలతో పాటు కుమారధార, పసుపుధార జంట జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com