Madanapalle : అమ్మ చెరువు మిట్టలో ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల‌ ఉక్కుపాదం

Madanapalle : అమ్మ చెరువు మిట్టలో ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల‌ ఉక్కుపాదం
X

దళారులకు పైసలిస్తే ఎంతటి విలువైన ప్రభుత్వ భూమినైనా అధికారులకు తెలియకుండా కట్టబెట్టే మహా ఘనులు మదనపల్లెలో కోకొల్లలుగా ఉన్నారు. దొంగ పట్టా సృష్టించి స్టాంపులు సైతం ముద్రించి అసలు పట్టా అనిపించేంతగా అమాయక ప్రజలకు అంటగడుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారుల రంగ ప్రవేశంతో తాము కొన్నవి నకిలీ పట్టాలని తెలిసి బాదితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి‌ వెళితే మదనపల్లె మండలం, కోళ్లబైలు పంచాయతీ లోని వెంకటేశ్వరపురం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు ఆనుకుని ఉంది. ఇక్కడంతా పేదలు, దినసరి కూలీలే ఉంటారు. ఈ ప్రాంతంలోని పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలను మంజూరు చేసింది. కొంతమంది అక్రమార్కులు పేదల బలహీనతలను సొమ్ము చేసుకుని వారికి కొంత నగదు ముట్టజెప్పి చట్ట విరుద్దంగా వారి స్థలాలను ఆక్రమించుకుని వారి స్థలాలకు ఆనుకుని ఉన్న మరింత ప్రభుత్వ స్థలాన్ని ఆ స్థలంలోకి కలుపుకుని పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మరి కొంతమంది తమ‌ వద్ద ఎలాంటి పత్రాలు లేకపోయినా బరితెగించి ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్న వారిలో పెద్ద పెద్ద వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాప్ట్ వేర్ ఇంజనీర్ లు ఉండడం గమనార్హం. ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అయినపుడు రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ తమ కార్యం చక్కబెట్టుకుంటూ ఉన్నారు. ఇదే విషయంగా సీపిఐ నాయకులు ఆక్రమణలపై రెవెన్యూ అధికారల ప్రమేయం ఉందని ఆరోపించడంపై తహశీల్దారు కిషోర్ కుమార్ రెడ్డి స్పందించి అమ్మచెరువు మిట్టలోని వెంకటేశ్వరపురంలో ఆక్రమణలు జరుగుతున్న ప్రదేశానికి రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలసి జెసిబి సహాయంతో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఏడు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ సిపిఐ నాయకులు అక్రమ కట్టడాలలో రెవెన్యూ అధికారులకు ముడుపులు ముడుతున్నాయి అని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకున్నారని ఆధారాలు ఉంటే ప్రజలకు బహిర్గతం చెయ్యాలన్నారు. కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ఎలాంటి దృవపత్రం విద్యుత్ అధికారులకు ఇవ్వరని అది పంచాయతీ అధికారుల చేతుల్లో ఉంటుందనే విషయం తెలుసుకోవాలన్నారు‌. తాను విధుల్లో చేరి రెండు నెలలే అవుతోందని సిపిఐ నాయకులు ఆరోపించిన కట్టడాలు 2022 సంవత్సరంలో నిర్మించారని స్పష్టం చేశారు.తాను విధుల్లోకి వచ్చినప్పటి నుండీ ఏ ఒక్కరికీ పొజిషన్ సర్టిఫికెట్ కానీ పట్టా కానీ మంజూరు చెయ్యలేదని తెలిపారు. మరోసారి తమపై నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే విధంగా ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారికి ఇదివరకే నోటీసులు జారీ చేశామని, వారంతట వారే ఆక్రమించిన కట్టడాన్ని తొలగించాలని లేదంటే వాటిని కూడా తామే తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా కట్టడాలు చేపట్టినట్లు తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, అన్నిటిని కూల్చేసి, అక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

Tags

Next Story