పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తమ బంధువులు మృత్యువు ఒడికి చేరుకోవడంతో బాధితుల రోధనలు కలిచివేశాయి. గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పెళ్లి బృందం వ్యాను బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి... కొండ పైనుంచి కిందకు పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు.

గోకవరం మండలం ఠాకూరుపాలెం గ్రామానికి చెందిన పెళ్లి బృందం... పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

చనిపోయినవారంతా పెళ్లి కొడుకు తరపు బంధువులు కాగా... గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 13 మంది ఉన్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

Tags

Next Story