Roja on Rishikonda: రుషికొండలో నిర్మించినవి పర్యాటక భవనాలు - రోజా

రుషికొండ భవనాల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మాజీ మంత్రి రోజా X వేదికగా స్పందించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? అంటూ ఆమె పలు ప్రశ్నలతో కూడిన పోస్ట్ చేశారు. పనిలో పనిగా సీఎం చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు.
విశాఖపట్నంలో రుషికొండలో వైసీపీ హయాంలో నిర్మించిన భవనాల విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే. జగన్ కోసం కట్టించుకున్న ఇంద్రభవనాలు అని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. వైసీపీ మాత్రం అవి పర్యాటక భవనాలు అంటూ సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు ఒక్కొరొకరుగా తమ వాదన వినిపిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి అమర్ నాధ్ ఇప్పటికే మీడియా సమావేశంలో అవేవీ అక్రమ కట్టడాలు కావనీ.. వాటిని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ లు విశాఖ వచ్చినపుడు బస చేయడం కోసం నిర్మించామని చెప్పుకుంటూ వచ్చారు. ఇక తాజాగా మాజీ పర్యాటక శాఖా మంత్రి రోజా ఈ కట్టడాల వివాదంపై స్పందించారు. పర్యాటక స్థలంలో పర్యాటక భవనాల నిర్మాణం తప్పా? అంటూ అనేక ప్రశ్నలతో కూడిన సుదీర్ఘమైన పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Xలో ట్వీట్ చేశారు.
‘‘విశాఖపట్నం నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాన్ని నిర్మిస్తే తప్పేముంది?..వర్షానికి ముంపునకు గురవుతున్న అసెంబ్లీ, సచివాలయాన్ని కట్టిన వారు తట్టుకోలేకపోవడం సమంజసమా? రుషికొండలో అత్యంత నాణ్యమైన భవనాల నిర్మాణాన్ని చూడండి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు పూర్తి వివరాలు అందించి 2021లో రుషికొండ నిర్మాణం చేపట్టింది నిజం కాదా?
మొత్తం 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖపట్నం గౌరవార్థం భవనాలు నిర్మించడం కూడా నేరమా? ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఫైవ్ స్టార్ సౌకర్యాలతో నిర్మాణాలు చేయడం తప్పా? మొత్తం ఏడు బ్లాకుల్లో నిర్మాణాలు, సౌకర్యాలు ఉంటాయని గతంలో టెండర్ పత్రాల్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా?
హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా? హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెగా చెల్లించిన వాళ్లా... ఈరోజు విమర్శలు చేసేది?
లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్‌లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది? మా జగనన్నపై, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు. వెనకడుగు వేసేది లేదు. జై జగన్..!" అంటూ రోజా ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com