Road Accident: పులివెందుల వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

25 మందికి గాయాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కదిరి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. పులివెందుల సమీపంలోని డంపింగ్‌యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్‌ బ్రేకులు వేశారు. దీంతో బస్సు స్కిడ్‌ అయి చెట్లను తాకుతూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. క్షతగాత్రులను తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

మరో రెండు రోడ్డు ప్రమాదాలు

అన్నమయ్య జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-చిత్తూరు జాతీయ రహదారిపై కలకడ దగ్గర ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో ప్రయాణికులతో సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి సొరకాయలపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న సంబేపల్లి, కలకడ పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా కలసపాడు మండలంలోని సింగరాయపల్లె దగ్గర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన బాషా కలసపాడు నుంచి తంబళ్లపల్లెకు బైక్‌పై వెళుతుండగా రెడ్డిపల్లి నుంచి పోరుమామిళ్ళకు వెళుతున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే చనిపోయాడు.

Tags

Next Story