స్వగ్రామానికి సాయితేజ పార్థివదేహం.. సొమ్మసిల్లి పడిపోయిన అతని భార్య

Sai Teja : లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం ఇల్లు చేరింది., నాలుగు రోజులుగా కడసారి చూపుకోసం నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులు... సాయితేజను మోసుకొచ్చిన పెట్టెను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. భర్తను ఆస్థితిలో చూసిన భార్య శ్యామలా సొమ్మసిల్లి పడిపోయింది. ఏం జరుగుతుందో కూడా తెలియని సాయితేజ పిల్లలు ధీనంగా చూస్తున్నారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సాయితేజను కడసారి చూసేందుకు ఎగువరేగడకు పెద్దసంఖ్యలో జనం తరలివస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి సైతం వచ్చిన జనంతో ఎగువరేగడ కన్నీటి సంద్రమైంది.
కాసేపట్లో సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. ఎగువరగడ గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు బెంగళూరు నుంచి ప్రత్యేక అంబులెన్సులో వచ్చిన సాయితేజ పార్థివదేహానికి కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల నుంచే ఘనమైన నివాళి అర్పించారు. దాదాపు 30కిలోమీటర్ల మేర భారీ ర్యాలీగా అంతిమయాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టి... జై జవాన్ నినాదాలతో సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com