AP : గ్రామ సచివాలయాల్లో ఇసుక బుకింగ్ కౌంటర్లు

వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఆయన మాట్లాడారు. "ఇసుక ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు. అది సామాన్యుడి హక్కు. దాన్ని ఎవరికి వారు ఇష్టానుసారం దోచుకోవడాన్ని మా ప్రభుత్వం సహించదు. సామాన్యులందరికీ ఇసుక ఉచితంగా లభించేలా పూర్తీ పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఇసుక కావాల్సిన వినియోగదారులు ఇకపైన తనకు ఎంత ఇసుక కావాలో తమ ప్రాంతంలోని సచివాలయంలోనే బుకింగ్ చేసుకునే విధానం తీసుకొస్తున్నాం." అన్నారు.
ఇసుక రీచ్ నుంచి తన ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణ ఛార్జీలు కూడా సచివాలయంలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు. "రీచ్ నుంచి ట్రక్కులో ఇసుక వినియోగదారుడి ఇంటికి చేరిన తరువాత, వినియోగదారుడు తనకు ఇసుక చేరిందని చెప్పిన తరువాతే ఆ రవాణ ఖర్చులు ఆ ట్రక్కు యజమానికి విడుదల చేసేలా పద్ధతి తీసుకొస్తాం. ఇసుక తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులన్ని కూడా ప్రీపెయిడ్ టాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తాం. రేట్లు కూడా స్టాండర్డైజ్ చేస్తాం" అన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com