కోనసీమలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా ప్రభల ఉత్సవాలు

Sankranthi 2022 : తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇక కోనసీమలో పండుగను ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోనసీమవ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం అట్టహాసంగా జరుపుతారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభలతీర్థానికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు ఉంది. దాదాపు 4 వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. 400 ఏళ్ల కిందట లోక కల్యాణార్ధం స్థానికంగా ఉన్న పదకొండు గ్రామాల శివుళ్ళు... సంక్రాంతినాడు జగ్గన్నతోటలో సమావేశం అయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా 11గ్రామాల రుద్రులను ఒక్కచోట చేర్చుతారు గ్రామస్తులు.
రుద్రులకు ఎలాంటి గుడి, గోపురం ఉండదు.. అంతా కొబ్బరితోటే. రుద్రప్రభలు జగ్గన్న తోటకు రావాలంటే మధ్యలోకాలువ దాటాలి. ప్రభలు కాలువ దాటుతున్న దృశ్యం భక్తులను గగుర్పాటుకు గురిచేస్తుంది. ప్రభలను ఏమాత్రం తొనక్కుడా తీసుకువచ్చే గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. 30 మందిమోస్తే కానీ లేవని ప్రభను... హరహరా అంటూ కాలువలోంచి తోటలోకి అవలీలగా తీసుకొస్తారు గ్రామస్థులు. కాలువలోకి వచ్చేముందు పంటను తొక్కుతూ రావడం ఆనవాయితీ. వేడుకలకు కోనసీమప్రజలే కాక, దేశవిదేశీయిలు వచ్చిదర్శించి తరిస్తారు. మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల విశ్వాసం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com