somu veerraju : సోమువీర్రాజు చీప్‌ లిక్కర్ కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు

somu veerraju : సోమువీర్రాజు చీప్‌ లిక్కర్ కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు
somu veerraju : ప్రజల్లోకెళ్లి ఓట్లెలా అడుగుతారు. మంచి విద్య, ఆరోగ్యం అందిస్తాం.. అభివృద్ధి చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తాం

somu veerraju : ప్రజల్లోకెళ్లి ఓట్లెలా అడుగుతారు. మంచి విద్య, ఆరోగ్యం అందిస్తాం.. అభివృద్ధి చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తాం.. పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు పెట్టిస్తాం.. ఇవి కదా చెబుతారు. కాని, సోమువీర్రాజేంటి అలా అంటారు. చీప్ లిక్కర్‌ 50 రూపాయలకే ఇస్తాం.. తమను గెలిపించండని అడుగుతున్నారేం. ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన కామెంట్స్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా దీనిపైనే నడుస్తోంది. ఏపీలో మందుబాబులు కోటి మంది ఉన్నారంటూ కొత్త గణాంకాలను తెర మీదకు తీసుకొచ్చారు సోమువీర్రాజు. చీప్‌ లిక్కర్‌ తాగేవాళ్లంతా బీజేపీకి ఓటు వేస్తే.. అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి చూపిస్తాం అనాలి గాని ఇవేం కామెంట్లు అని జనం విసుక్కుంటున్నారు.

బీజేపీ అధికారంలోకి రావాలన్నా, తమకే ఓటు వేయండని అడగాలన్నా.. చాలా అంశాలున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని చెప్పండి.. జనం ఓటేస్తారు. అమరావతే రాజధాని అని అధికారికంగా చెప్పండి.. జనం ఓటేస్తారు. రైల్వే జోన్‌ ప్రకటించండి.. జనం ఓటేస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం అని చెప్పండి.. జనం ఓటేస్తారు. కడప స్టీల్‌ ప్లాంట్, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, జాతీయ సంస్థల ఏర్పాటు, పోర్టులు, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు.. ఇవన్నీ మరో రెండేళ్లలో పూర్తి చేస్తాం అని చెప్పండి జనం ఓట్లేస్తారు. చెప్పుకోడానికి ఇన్ని ఉన్నప్పుడు.. అవన్నీ వదిలేసి.. చీప్‌ లిక్కర్‌ను మరింత చీప్‌గా అందిస్తాం అనడమేంటని తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

పేరు ప్రజాగ్రహ సభ. జనంలో జగన్ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహం ఉందో చెప్పే సభ. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీపై కాలయాపన జరుగుతోంది.. దీన్ని హైలెట్ చేయాలి. ఓటీఎస్ పేరుతో పేదలను దోచేస్తున్నారు.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కేంద్రం ఇస్తున్న నిధులకు లెక్కచెప్పమని నిలదీయాలి, పంచాయతీ నిధులను ఎందుకు వాడుకున్నారో చెప్పాలని ఒత్తిడి తేవాలి. అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్న జగన్ సర్కార్.. చేసిన అప్పులన్నీ ఏం చేస్తున్నారో లెక్క చెప్పాలని అడగాలి. దళితులు, దేవాలయాలపై దాడులు, వైసీపీ నేతల అరాచకాలు, చేస్తున్న అవినీతి అక్రమాలు, సామాన్యుడిపై జరుగుతున్న దోపిడీ.. వీటన్నింటిపై నిలదీయాలి. అవన్నీ వదిలేసి.. లిక్కర్‌పై ఫోకస్ పెట్టడం ఏంటని సోమువీర్రాజును ఆడేసుకుంటున్నారు జనం.

సోమువీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలను ఇవాళ కూడా సమర్ధించుకున్నారు. ఒక్కో బుడ్డీకి 250 రూపాయలు వసూలు చేస్తున్నారని, చీప్ లిక్కర్ 50 రూపాయలకు తగ్గిస్తే ఆడపడుచులకు 6వేల రూపాయలు మిగిల్చినట్టేనని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story