మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు పరిధి దాటి వ్యవహరించకూడదు.. : ఎస్‌ఈసీ

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు పరిధి దాటి వ్యవహరించకూడదు.. : ఎస్‌ఈసీ
న్నికల సంఘం ఆంక్షల్ని అతిక్రమిస్తే కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు పరిధి దాటి వ్యవహరించకూడదని ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆంక్షల్ని అతిక్రమిస్తే కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని తెలిపారు. విజయవాడలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఎస్‌ఈసీ.. కోడ్‌ ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ఏపీలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు.... అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు కొనసాగిస్తోంది. శనివారం తిరుపతిలో సమీక్షలు ప్రారంభించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌... ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... ఎన్నికల నిబంధనల్ని వివరించారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని తెలిపారు. రోడ్‌షోలకు సింగిల్‌ విండో విధానం ద్వారా పరిమితంగా అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గతంలో ఒత్తిళ్లతో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విషయంపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ఈ అంశంలో సానుభూతితో వ్యవహరిస్తామని... వివక్షకు గురైన వారి అభ్యర్థిత్వాలు పునరుద్ధరిస్తామని అన్నారు. త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. గతంలో నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి నుంచి కొత్తగా నామినేషన్లు అనుమతించబోమని స్పష్టంచేశారు.

మున్సిపల్‌ ఎన్నికల సమీక్ష సమావేశాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మెరుగైన పనితీరు కనబర్చనున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం మరింత మెరుగవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇవాళ విశాఖపట్నంలో మూడో సమావేశం నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story