ycp: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో జగన్ పార్టీకి దిక్కుతోచడం లేదు. కీలకనేతలందరూ ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడటంతో దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో కూడా ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. ఉమ్మడి ఏలూరు జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. తాము త్వరలో జనసేనలోకి వెళ్లబోతున్నట్లు వెల్లడించారు. మొన్న మాజీ ఉపముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఏలూరు మేయరు నూర్జహాన-పెదబాబు దంపతులు పార్టీని వీడారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు కూడా పార్టీని వీడడంతో ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయింది.
ఏలూరు నియోజకవర్గ ముఖ్య నేతలైన ఇడా మాజీ ఛైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు నగర పాలక సంస్థలో వైసీపీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయరు దంపతులతో పాటు బొద్దాని మైబాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరటంతో నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. ముందుముందు మరో 15 మంది కార్పొరేటర్లతోపాటు మరికొంతమంది ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వైసీపీకి గడ్డు కాలం మొదలైంది.
పశ్చిమ గోదావరిలోనూ...
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు. పదమూడేళ్లుగా వైసీపీలో పని చేశానని, కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని పద్మశ్రీ వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని, ఆయన నేతృత్వంలో జిల్లా పరిషత్తు ద్వారా ప్రజలకు సేవలందించడానికి, గ్రామాల అభివృద్ధికి ఇదొక మంచి అవకాశంగా భావించి త్వరలో జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. వైసీపీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేయడానికి తన వ్యక్తిగత కారణాలే తప్ప మరొక కారణం లేదని వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేయడంతో జడ్పీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com