Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా నిర్మిస్తారా? బ్యారేజ్ స్థాయికే వదిలేస్తారా?

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిర్మిస్తారా? లేక బ్యారేజ్ స్థాయికే కట్టి వదిలేస్తారా? కేంద్ర జల్‌శక్తి శాఖ వార్షిక నివేదిక చూసిన నీటిపారుదలరంగ నిపుణులు ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసాన్ని రెండు దశల్లో చేపట్టాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే.. ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలోనే ముందుగా నీటిని నిల్వ చేయాలనుకుంటున్నారు.
41 కాంటూరు వరకు నీటిని నిల్వ చేస్తే ఎందరిని తరలించాలన్నది లెక్కిస్తారు. దాన్ని బట్టి నిర్వాసితులను తరలిస్తారు. ఇక 41 కాంటూరు పైన నీటిని నిల్వచేస్తే ఇంకెంత మంది నిర్వాసితులవుతారో మళ్లీ లెక్కిస్తారు. రెండో దశలో భాగంగా ఆ నిర్వాసిత కుటుంబాలను తరలిస్తారు. దీన్ని బట్టి ఒక దశకే ప్రాజెక్టును పరిమితం చేస్తే ఎలా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
41.15 మీటర్ల స్థాయిలోనే నీటిని నిల్వ చేస్తే గనక.. పోలవరం కేవలం బ్యారేజ్‌గానే మిగిలిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసే వార్షిక నివేదికలో పోలవరాన్ని రెండు ఫేజ్‌లలో నిర్మించాలన్న ప్రతిపాదన తొలిసారిగా కనిపించింది. పోలవరం తొలి దశ, రెండో దశలకు ఏ స్థాయి నిధులు అవసరమవుతాయి, అలా రెండు దశలలో కడితే ఎంత ప్రయోజనం ఉంటుందనే అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఇప్పటికే సమావేశం కూడా ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం వీటి అంచనాలను రూపొందించే పనుల్లో ఉన్నారు అధికారులు. అంటే.. పోలవరం పునరావాసాన్ని 2 దశల్లో చేపట్టడం వల్ల.. పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఇప్పుడప్పుడే ఉండబోదంటున్నారు నీటిపారుదల రంగ విశ్లేషకులు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకన నడుస్తోందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో కనిపిస్తోంది. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పురోగతి కేవలం 1.46 శాతమేనని రిపోర్టులు చెబుతున్నాయి.
గతేడాది 2020-21 వార్షిక నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసింది. 2020 డిసెంబర్ వరకు ప్రాజెక్ట్‌ను ఎంత వరకు కట్టారో వివరించింది. తాజా నివేదికలో 2021 నవంబర్ నెలాఖరు వరకు ప్రాజెక్టులో ఎంత శాతం పనులయ్యాయో వివరించారు. ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. ఏడాదిలో జరిగిన పురోగతి కేవలం ఒకటిన్నర శాతం కూడా లేదని తేలింది. ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ పనులు కూడా ఏడాదిలో కేవలం 4 శాతమే జరిగాయి.
ఇక భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌లో పురోగతి కేవలం 0.34 శాతం మాత్రమేనని కేంద్ర నివేదిక చెబుతోంది. ప్రభుత్వ, అటవీ భూమిని మినహాయిస్తే పోలవరం ప్రాజెక్ట్ కోసం లక్షా 55వేల 465 ఎకరాలు అవసరం. 2021 నవంబర్ వరకు లక్షా 12వేల 768 ఎకరాలు సేకరించారు. మొత్తానికి జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com