AP: శ్రీవారి లడ్డూ కల్తీపై విచారణ వేగవంతం
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతమైంది. నేటి నుంచి మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ కొనసాగించనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలుగా దర్యాప్తు చేయనున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు చేయనుంది. టీటీడీ బోర్డ్ దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాల లోతుగా దర్యాప్తు చేయనున్నారు. అలాగే, తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలను సిట్ అధికారులు తెలుసుకోనున్నారు.
తమిళనాడుకు బృందం...
ఇక, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ బృందం దర్యాప్తు చేయనుంది. అలాగే, మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకలను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. ఇంకో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలన చేయనుంది.
ముగిసిన తొలి సమావేశం
శనివారం తిరుపతి పోలీస్ అతిథిగృహంలో సమావేశమైన సిట్ సభ్యులు.. లడ్డూ అపవిత్రం చేయడం వెనకదాగిన కుట్రను వెలికితీసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరుపై చర్చించారు. దాదాపు 2 గంటలకు పాటు సమావేశం కొనసాగింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ట త్రిపాఠి పూర్తి దర్యాప్తును పర్యవేక్షించనుండగా.. మిగిలిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు లోతుగా దర్యాప్తు చేయనున్నాయి. సిట్ బృందం మూడు రోజుల పాటు తిరుపతిలోనే ఉండి విచారణ చేపట్టనుంది. సిట్ కార్యకలాపాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతభవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
బాగోలేదన్నా చర్యలు తీసుకోలేదు
శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డూలను సిబ్బంది తయారు చేస్తారు. ఇందుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఈ సందర్భంలోనే తిరుమలలో 82,100 కిలోల సామర్థ్యంతో మూడు నెయ్యి యూనిట్లును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు లడ్డూలు సరఫరా చేయాల్సిన నేపథ్యంలో 40 థర్మోఫ్లూయిడ్ స్టవ్‌లతో బూందీపోటును ఏర్పాటు చేశారు. గతంలో లడ్డూను తయారు చేసేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం నెయ్యి వినియోగించడాన్ని తొలుత బూందీపోటులో పనిచేసే సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ, ఈవో సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయిన ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా బూందీ, నెయ్యి కలిపే సమయంలో సువాసన వస్తుంది. పుర వీధుల్లో తిరుగుతున్న భక్తులు ఈ సువాసనను ఆస్వాదించేవారు. నాసిరకం నెయ్యి వినియోగించినప్పటి నుంచి లడ్డూ తయారు చేసేటప్పుడే కనీసం సువాసన వచ్చేది కాదని కొంత మంది పోటు సిబ్బంది వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com