SIT: టీటీడీ పరకామణి వ్యవహారంపై సిట్: లోకేశ్

పరకామణిలో చోరీ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటానని చెప్పారు. పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కాక రేపుతోంది. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును నీరుగార్చారని, అసలైన దొంగను అరెస్ట్ చేయకుండా కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారని ఆయన ఆరోపించారు. జగన్ బృందం దేవుడి దగ్గర నాటకాలు ఆడటం వల్లే, ఆ దేవుడే వారికి తగిన శిక్ష వేశాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభిస్తున్నాయని తెలిపారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడం లేదని, కేవలం పీపీపీ మోడ్‌లో వెళ్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రోడ్లను కూడా అదే విధానంలో చేస్తున్నామన్నారు. పులివెందులలో జగన్ కనీసం కాలేజీ కట్టలేదన్నారు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుందన్నారు. అక్టోబర్ నుంచి రాష్ట్రానికి వరుస పెట్టుబడులు తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కృషి జరుగుతోందన్నారు. '
మెగా డీఎస్సీ వేడుక... పవన్‌కు లోకేశ్ ఆహ్వానం
ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈనెల 25వ తేదీన ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం భారీ కార్యక్రమం చేపట్టింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈనెల 19వ తేదీన నియామక పత్రాలు అదే ప్రాంతంలో అందజేయాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. తిరిగి ఈనెల 25న కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను విద్యా మంత్రి నారా లోకేశ్ కలిశారు. శాసనసభ సమావేశాల విరామ సమయంలో పవన్ ఛాంబర్‌కు వచ్చిన లోకేశ్.. ఈనెల 25న నిర్వహించే డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన భారీ నియామకం కావటంతో.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు దాదాపు 106 కేసులు వేశారని లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఏళ్ల తరబడి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేశ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com