SKILL CASE: చంద్రబాబు అరెస్ట్.. జగన్ కక్ష సాధింపే

ప్రజాస్వామ్యంలో చట్టం రాజకీయాలకు ఆయుధంగా మారితే, న్యాయవ్యవస్థే చివరి ఆశగా నిలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు క్లోజ్ కావడం, ఆ అరెస్టు వెనుక న్యాయబద్ధత కంటే రాజకీయ ప్రతీకారమే ప్రధానంగా పనిచేసిందన్న అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఆధారాల్లేని ఆరోపణలు, ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా తేలిన కేసు, 53 రోజుల రిమాండ్... ఈ పరిణామాలన్నీ చట్టపాలన పేరుతో రాజకీయ కక్ష సాధింపుకు చోటిచ్చిన ప్రమాదకర ధోరణిపై తీవ్ర ఆలోచన అవసరమని ఈ తీర్పు స్పష్టంగా హెచ్చరిస్తోంది. చంద్రబాబును జైలుకు పంపించడమే లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్రగా మారిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చివరకు కుప్పకూలింది. ఆధారాల్లేని ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతో సాగిన దర్యాప్తు, అధికార దర్పానికి అద్దం పట్టిన అరెస్ట్.. ఈ మొత్తం వ్యవహారం ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా తేల్చుతూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక అప్పటి సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపే ఉందన్న ఆరోపణలకు న్యాయస్థానం పరోక్షంగా ఆమోద ముద్ర వేసినట్టైంది. అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతోపాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేయడంతో.. ఓ సంచలన కేసుకు ముగింపు పలికినట్లయింది.
కీలక తీర్పు
స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
తప్పుడు ప్రచారమే !
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని గత ప్రభుత్వం ఆరోపించింది. అయితే, విచారణలో ఒక్క రూపాయి కూడా దారి మళ్లినట్లు సీఐడీ పక్కా ఆధారాలు చూపలేకపోయింది. సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు, కనీసం ఎఫ్.ఐ.ఆర్ లో ఆయన పేరు కూడా లేదు. ప్రాథమిక ఆధారాలు చూపలేదు. లాయర్ గా కోర్టులో వాదనలకు.. రాజకీయ వాదనలకు తేడా తెలియని పొన్నవోలు వాదించి జైలుకు పంపారు. కానీ దర్యాప్తులో కనీస ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని నిర్ధారించడంతో, ఆ 53 రోజుల జైలు శిక్షకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

