SKILL CASE: చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా చేరిందా?

SKILL CASE: చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా చేరిందా?
స్కిల్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలేవీ? సీఐడీని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ కోరుతూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై బుధవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను దురుద్దేశంతో ఏర్పాటు చేశారన్న సీఐడీ వాదన వాస్తవ విరుద్ధమని వాదించారు. సమష్టి నిర్ణయాలను వ్యక్తులకు ఆపాదించడం సరికాదంటూ సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని గుర్తు చేశారు. డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ సంస్థకు చెందిన సంజయ్‌ డాగా అప్పటి సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం వినతి సమర్పించారని, తర్వాత మంత్రివర్గం ఆమోదంతోనే సంస్థ ఏర్పాటైందని వివరించారు. నిధులు కూడా విడుదలయ్యాయని తెలిపారు. క్యాబినెట్‌ నిర్ణయం సమష్టిగా తీసుకుందని, అది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయమని చెప్పేందుకు సీఐడీ వద్ద ఆధారాల్లేవని వివరించారు.


సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌, APSSDC మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదన్నారు. ఈ వ్యవహారంలో ఆయన్ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని వాదించారు. APSSDCకి కేంద్ర ప్రభుత్వం కొంత నిధులిచ్చిందన్న దూబే రాష్ట్రపతి సైతం గెజిట్‌ జారీ చేశారని తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నాయని రాష్ట్రపతిని సైతం ఇందులోకి లాగుతారా అని ప్రశ్నించారు ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చంద్రబాబుకు వర్తించవన్నారు.సీఐడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం చంద్రబాబు తన కోసమే రూపొందించుకున్నారని తెలిపారు.


నిందితులు అనుచిత ఆర్థిక లబ్ధి పొందారని, ఏసీబీ సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ అమల్లోకి రాకముందే ఈ కేసులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అధీకృత అథార్టీ నుంచి అనుమతి అవసరం లేదన్నారు. ఒప్పందంలో భాగమైన సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలు.. ఈ ప్రాజెక్టులో 90 శాతం వాటా ఇస్తాయన్న ఉద్దేశంతో క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. కానీ వారు ఆ మేరకు ఇవ్వకపోయినా ఒక్కరైనా వేలెత్తి చూపలేదని తెలిపారు. ఆర్థికశాఖ అప్పటి కార్యదర్శి అభ్యంతరాలను పట్టించుకోకుండా సొమ్ము విడుదల చేశారని.., ఈ విషయంలో చంద్రబాబును విచారించాల్సి ఉందని వాదించారు. అందుకోసమే మరో 5 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నామని తెలిపారు. పిటిషనర్‌ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, గతంలో వాంగ్మూలాలు ఇచ్చినవారు మాట మారుస్తున్నారని వాదించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయొద్దని కోరారు.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో కుంభకోణం జరిగిందనుకున్నా ఈ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్లు కానీ, నిధుల దుర్వినియోగంలో ఆయన పాత్ర ఉందని కానీ, ఒక్క రూపాయి సొమ్ము అయినా ఆయనకు చేరినట్లు కానీ ప్రాథమిక ఆధారాలేవీ లేవు కదా అని సీఐడీని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. నిధుల దుర్వినియోగంపై 2021 డిసెంబర్‌ 9న కేసు నమోదు చేసినప్పటికీ , దీనిలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయారని పేర్కొంది. 2021 డిసెంబర్లో నమోదు చేసిన FIRలో చంద్రబాబు పేరు లేదు కదా అని వ్యాఖ్యానించింది.ఇప్పటి వరకు ఆయనపై కొత్త ఆరోపణలేమీ లేవని పేర్కొంది. చంద్రబాబును జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపామని, తర్వాత రెండు రోజులు పోలీసు కస్టడీకి కూడా ఇచ్చామని గుర్తుచేసింది.దర్యాప్తు పురోగతి ఏంటని సీఐడీని ప్రశ్నించింది. అనంతరం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story