SKILL CASE: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నేడు తీర్పు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలు కోసం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. నిన్న(సోమవారం) జరిగిన విచారణలో అనుబంధ పిటిషన్‌పై ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగియడంతో ఇవాళ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రకటించారు. అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం వెల్లడించే నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిలు పిటిషన్‌పై విచారణ ఉంటుందని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. సోమవారం విచారణలో సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వివేకానంద స్పందిస్తూ న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన బెయిలు పిటిషన్, మధ్యంతర బెయిలు పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి చంద్రబాబుపై నమోదు చేసిన కేసులే నిదర్శనమన్నారు. 2021లో నమోదు చేసిన కేసును తెరపైకి తెచ్చి చంద్రబాబును నిందితుడిగా చూపి, హఠాత్తుగా అరెస్టు చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కుట్రపూరితంగా పిటిషనర్‌ను వివిధ కేసుల్లో ఇరికించిందన్నారు. 52 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17-ఎ నిబంధన ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి పొందకుండానే నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసి, తీర్పు రిజర్వులో ఉందని గుర్తుచేశారు.
చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజులు పోలీసులు కస్టడీకి ఇచ్చిందని.. సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించారని చెప్పారు. మరో 5 రోజులు కస్టడీ కోరితే ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. అందువల్ల పిటిషనర్‌ను ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆరేళ్ల కిందట చెల్లించిన సొమ్ము ఎక్కడికెళ్లిందో తేల్చాలని సీఐడీ చెబుతోందని, పిటిషనర్‌ను జైల్లో ఉంచి దాన్ని తేల్చాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తాకలేదని.. ఆయన్ను అపకీర్తి పాలు చేయడానికే తప్పుడు కేసులో ఇరికించారన్నారు.
జైల్లో ఉన్న చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ఎడమ కంటి శుక్లాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారని.. సెప్టెంబర్‌లోపు కుడికన్నుకు సైతం చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నారు. కుడి కంటిచూపు మందగించినందున అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలన్నారు. జాప్యం చేస్తే ప్రమాదమన్నారు. చంద్రబాబును జైల్లోనే ఉంచి ఇబ్బందిపెట్టాలనే సీఐడీ దర్యాప్తును సాగదీస్తోందన్నారు. సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. కంటి శుక్లం అపరిపక్వ దశలోనే ఉన్నందున తక్షణం శస్త్రచికిత్స అక్కర్లేదన్నారు. చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com