TDP-JANASENA: టీడీపీ-జనసేన పొత్తులో త్వరలో కీలక ముందడుగు

తెలుగుదేశం-జనసేన పొత్తుపై మరో కీలక ముందడుగుపడనుంది. లోకేశ్ ఢిల్లీ నుంచి రాగానే సమన్వయ కమిటీ సభ్యులను ఎంపిక చేద్దామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో యనమల ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా యనమలతో చంద్రబాబు అనేక విషయాలపై చర్చించారు. పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధించడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేణులకు సీనియర్ నేతలంతా అండగా నిలవాలని సూచించారు. యనమలతోపాటు భువనేశ్వరి, బ్రాహ్మణి చంద్రబాబును జైలులో కలిశారు.
తెలుగు ప్రజల కోసం, తాను ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలని కానీ జగన్ సర్కార్ చేసే అరాచకాలపై పోరాటం మాత్రం ఆపొద్దని తనను కలిసిన యనమల రామకృష్ణుడుకు చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన యనమల రామకృష్ణుడు వివిధ అంశాలపై దాదాపు 10 నిమిషాల పాటు చర్చించారు. జనసేనతో పొత్తు అంశం ప్రస్తావనకు తెచ్చిన యనమల పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యుల నియామకం అంశాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. లోకేశ్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సమన్వయ కమిటీ సభ్యులను ఎంపిక చేద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.
ఇప్పటికే తెలుగుదేశం-జనసేన శ్రేణులు రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో కలసి కార్యక్రమాలు చేస్తున్న తీరు యనమల చంద్రబాబుకు వివరించారు. తనను జైల్లో పెట్టి జగన్ పొందుతోంది తాత్కాలిక ఆనందమేనని, వైసీపీ పనైపోయిందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. తెలుగుదేశం నేతలు, శ్రేణులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టడమే బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా ఉండాలని యనమలకు సూచించారు. తన అరెస్ట్ ను ఖండిస్తూ సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపాలని చంద్రబాబు కోరారు.
పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని యనమల రామకృష్ణుడు తెలిపారు.యనమలతోపాటు భువనేశ్వరి, బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి, బ్రాహ్మణితో చంద్రబాబు 20 నిమిషాలు పాటు విడిగా సమావేశమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com