Ap News : విజయవాడలో సౌత్ జోన్ సైన్స్ ఫెయిర్

దక్షిణ భారతంలో జరిగే అతిపెద్ద వైజ్ఞానిక మహోత్సవంగా పేరు పొందింది సౌత్ జోన్ సైన్స్ ఫెయిర్. ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విజ్ఞాన ప్రదర్శనకు వేదికయ్యింది. ఈ సైన్స్ ఫెయిర్‌లో దక్షిణాదిలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి 35 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మొత్తం 210 వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు వివిధ రాష్ట్రాల విద్యార్థులు. విజయవాడలోని మురళీ కన్వెన్షన్ సెంటర్‌లో సౌత్ జోన్ సైన్స్ ఫెయిర్ ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో మొత్తం 420 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలను ఉత్సాహంగా ప్రదర్శించారు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆలోచింపజేసే సాంకేతిక ఆవిష్కరణలతో అందరినీ మెప్పించారు.
ఒకరితో ఒకరు పోటీపడుతూ ఆవిష్కరణలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు విద్యార్థులు. కేరళ విద్యార్థి నయిప్ నిషాద్ తయారు చేసిన బోరుబావుల్లో పడిన పిల్లలను, గొట్టంలోకి ప్రత్యేక పరికరాన్ని పంపి సులువుగా తీసే ప్రాజెక్టు అందరిని ఆకట్టుకుంది బహుళ ప్రయోజనాలు ఉండే వినూత్న స్మార్ట్ బోట్ చూపరులను ఆకర్షించింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను వాడకుండానే సౌరశక్తిని వాడుకుని అన్ని పనులూ చేసేస్తుంది. అమలాపురంకు చెందిన జడ్పీ హైస్కూల్ విద్యార్థి అనీల సుధ ప్రదర్శించిన సౌరశక్తి పశువుల షెడ్డు , రైతులకు ఉపకరించే మల్టీపర్పస్ అగ్రికల్చర్ ప్రాజెక్టును నదుల్లో, కాల్వల్లో కొట్టుకుపోయే వారిని న్యూమాటిక్ రెస్క్యూ గన్‌తో రక్షించే ప్రాజెక్టు, ఇలా రకరకాల ప్రాజెక్టు లు అందరినీ ఆశ్చర్య పరిచాయి. 4 రోజుల పాటు సాగిన ఈ సైన్స్ ఫేర్‌ను తిలకించేందుకు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. వయసుకు మించిన పరిణతిని ప్రదర్శిస్తూ సాంకేతిక ఆవిష్కరణలతో అబ్బురపరిచారు విద్యార్థులు. వారు ఇప్పటి నుంచే శాస్త్ర, సాంకేతిక పరిశోధనల వైపు మళ్లేందుకు ఈ విజ్ఞాన మహోత్సవం దోహదం చేస్తుందని నిర్వాహకులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com