YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో రంగంలోకి దిగనున్న ఢిల్లీ టీమ్..

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఉత్కంఠను రేపుతోంది.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ డీఐజీ చౌరాసియా, అడిషనల్ ఎస్పీ రాంసింగ్ రేపు ఢిల్లీ నుంచి కడప రానున్నారు.. మిగిలిన నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం.. రేపు వీరిని విచారణ పిలిచే అవకాశం కనిపిస్తోంది.. అటు ఈ కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు కూడా బయటికొస్తున్నాయి..
వివేకా బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గతేడాది అగస్టు 28న సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే గుండెపోటు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని, ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకే వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి సమక్షంలోనే ఆధారాల ధ్వంసం జరిగిందని.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు అక్కడున్న రక్తాన్ని పనిమనుషులు తుడిచారని సీబీఐ వాంగ్మూలంలో శివప్రకాష్ రెడ్డి వివరించారు.ఈ వాంగ్మూలాల ఆధారంగా రేపు వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.. అటు రేపు విచారణ కీలకం కావడంతో సీబీఐ అధికారులు ప్రత్యేక పోలీసు బలగాల సాయం కోరినట్లుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com