Amaravati Sports City : అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.
స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పెదలంక, చినలంక గ్రామాల్లోని భూములు అనుకూలమని గుర్తించడంలో పురపాలకశాఖ మంత్రి పి.నారాయణతో పాటు, విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం మంగళగిరి వద్ద ఉన్న క్రికెట్ స్టేడియం సాంకేతిక కారణాల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలం కాదని తేలింది. దానికి ప్రత్యామ్నాయంగా స్పోర్ట్స్‌సిటీలో భారీ స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్థాయిలో సుమారు 1.25 లక్షల మంది వీక్షించే సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలన్నది ఏసీఏ ప్రతిపాదన. పార్కింగ్ వంటి వసతులతో కలిపి.. ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి దాదాపు 100 ఎకరాల వరకు అవసరమవుతుంది.
ఈ స్టేడియం నిర్మాణానికయ్యే ఖర్చులో 60 శాతం ఇచ్చేందుకు బీసీసీఐ అంగీకరించింది. మిగతా 40 శాతం ఏసీఏ భరిస్తుంది. మౌలిక వసతులకయ్యే ఖర్చులోనూ కొంత ఇచ్చేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అమరావతి స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఒక సంవత్సరంలో కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించేందుకు బీసీసీఐ అంగీకరించినట్టు సమాచారం. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవల దుబాయి, విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్‌లకు హాజరైనప్పుడు ఐసీసీ ఛైర్మన్ జైషాతో ఈ అంశంపై చర్చించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com