మరో ప్రేమకథ.. హద్దులు చెరిపేసి సరిహద్దులు దాటేసి..

మరో ప్రేమకథ.. హద్దులు చెరిపేసి సరిహద్దులు దాటేసి..
మరో సరిహద్దు ప్రేమకథలో, ఒక శ్రీలంక మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైన భారతీయ వ్యక్తిని వివాహం చేసుకుంది.

మరో సరిహద్దు ప్రేమకథలో, ఒక శ్రీలంక మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైన భారతీయ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఫేస్‌బుక్‌ పుణ్యమా అని కలుసుకున్నాము అని ఇద్దరూ తెగ సంతోషపడిపోతున్నారు.. మరి ఈ ప్రేమ ఎన్నాళ్లుంటుందో తెలియదు కానీ ముందైతే ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రియుడి కోసం శ్రీలంక నుంచి వచ్చేసింది 25 ఏళ్ల విగ్నేశ్వరి శివకుమార.

టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన శ్రీలంక యువతి, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఆంధ్రా యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ వెంకటగిరికోటకు చెందిన లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆమె వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుండగా.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల మేరకు చిత్తూరు జిల్లా పోలీసులు విగ్నేశ్వరికి నోటీసు జారీ చేశారు.

ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 8న విగ్నేశ్వరి ఆంధ్ర ప్రదేశ్‌కి చేరుకోగా, జూలై 20న ఆలయంలో వివాహం చేసుకున్నారు. విగ్నేశ్వరి, లక్ష్మణ్ 2017లో ఫేస్‌బుక్‌లో కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. లక్ష్మణ్ కుటుంబసభ్యుల ఆశీస్సులతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

విగ్నేశ్వరి భారత పౌరసత్వం పొందాలనుకుంటోంది. ఆమె వీసా పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో చట్టపరమైన సంక్లిష్టతలను నివారించేందుకు, తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకోవాలని పోలీసులు దంపతులకు సూచించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై రిశాంత్ రెడ్డి భారత పౌరసత్వం పొందే విధానం గురించి విగ్నేశ్వరికి తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story