Andhra Pradesh: ఊరూరా ఘనంగా శ్రీరాముని శోభాయాత్రలు, పూజలు

Andhra Pradesh:  ఊరూరా ఘనంగా శ్రీరాముని శోభాయాత్రలు, పూజలు
X
పల్లె పల్లె లోనూ ప్రత్యేక పూజలు

అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీకాకుళంలో నాగవళి నదీ గర్భంలో భాస్కరభట్ల శ్రీరామశర్మ గురువు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. భారీగా భక్త జనం ఈ వేడుకల్లో పాల్గొని పులకించిపోయారు. కోనసీమ వ్యాప్తంగా రామనామ జపం మార్మోగింది. రాములోరి ఆలయాలను చక్కగా అలంకరించి భక్తజనం పూజలు నిర్వహిస్తున్నారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని ఆలయం నుంచి శోభాయాత్ర చేపట్టారు. మేళతాళాల మధ్య స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. అమలాపురం మొదలుకొని ఊరువాడ భక్తజనం శ్రీరాముని ఊరేగింపులు నిర్వహించారు. తిరుపతిలోని రామధూత ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. కపిలతీర్ధం కూడలిలో బాణాసంచా కాల్చిన అనంతరం రాముడి చిత్రపటానికి పూజలు చేశారు. ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగింది. 500 సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీరాముడు పుట్టిన చోట ప్రాణప్రతిష్ట జరగడం సంతోషంగా ఉందని రామధూత ఫౌండేషన్‍ సభ్యులు తెలిపారు.


అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా N.T.R. జిల్లా నందిగామలో... శ్రీరామ వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం సెట్టింగ్ వేశారు. ముక్కోటి మహా మండపం నుంచి... శ్రీ సీతారామ లక్షణ సహిత ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అఖండ దీపారాధన చేశారు. స్వామి వారి ఏక నామం, అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ యాగం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. పది వేల మందికి అన్నదానం చేశారు.


అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో శ్రీరామ భక్తులు రథయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీతారాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ ఉత్సవ సమితి, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి, లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్వంలో రథయాత్ర చేపట్టారు. వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భక్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురవీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. అయోధ్యలో అంగరంగవైభవంగా జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టను వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకమండలి ప్రతినిధి మస్తానయ్య తెలిపారు.


ప్రత్యేక బోర్డుపై శ్రీరామ విగ్రహంతో విశాఖ సముద్రం లోపల స్కూభా డైవర్లు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని.. విశాఖ బుుషికొండ బీచ్ లో 22 అడుగుల నీటి అడుగున విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతీ భారతీయుడి ప్రతిష్ఠాత్మకమైన 5 వందల ఏళ్ల నాటి కల.. చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం నేటికి సాకారమైందని స్కూభా డైవర్స్ తెలిపారు.

Tags

Next Story