Srikalahasti: వివాదంలో చిక్కుకున్న CI అంజూ యాదవ్

Srikalahasti: వివాదంలో చిక్కుకున్న CI అంజూ యాదవ్
పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన శ్రీకాళహస్తి జనసేన నేతల్ని అడ్డుకోవడమే కాకుండా ఆ పార్టీ నేత సాయిపై చేయిచేసుకున్నారు. రెండు చెంపలు ఇష్టానుసారంగా వాయించారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన శ్రీకాళహస్తి జనసేన నేతల్ని అడ్డుకోవడమే కాకుండా ఆ పార్టీ నేత సాయిపై చేయిచేసుకున్నారు. రెండు చెంపలు ఇష్టానుసారంగా వాయించారు. అంతేకాదు వన్ టౌన్ పీఎస్ కు తీసుకెళ్లి జనసేన నేతలపై మరోసారి చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియో తీస్తున్న వారి మొబైల్స్ ను కూడా లాక్కున్నట్లు తెలుస్తోంది. అంజూయాదవ్ తీరుపై మండిపడుతున్నారు జనసేననేతలు. ఆమె ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు. అంజు యాక్షన్ పై నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన క్యాడర్ . తీవ్రంగా రియాక్టైంది. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఐ తీరుపై పోలీస్ బాస్ లు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సీఐ నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది.

అంజూ యాదవ్‌.. గతంలోనూ ఇలాగే వివాదల్లో చిక్కుకున్నారు. ఏ స్టేషన్లో పనిచేసినా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తారని ఆమెకు పేరు ఉంది. అంతే కాదు కేవలం అట్టడుగు వర్గాలు, పేదలపైనే ప్రతాపం చూపిస్తారంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. వైసీపీ నేతలపై మాత్రం ఈగ వాలనివ్వరనే విమర్శలూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగినా వైసీపీ నేతల కంటే ఈమె ఎక్కువగా బాధపడతారనే టాక్!. ఇక ఆందోళన చేస్తున్న విపక్ష నేతలపై ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటారు. వెనకాముందూ చూడకుండా చేయి చేసుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు విపక్షనేతలు.

సత్యవేడు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ ఆమెది ఇదే తీరు. న్యాయం కోసం వచ్చే బాధితులను పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ఎంతసేపు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. 2009 నుంచి 2011 మధ్యకాలంలో తిరుపతి వెస్ట్ సీఐ గా పనిచేస్తున్న సమయంలోనూ ఏకంగా పోలీసు శాఖ సిబ్బందినే ఇబ్బంది పెట్టి శాఖా పరమైన విచారణ ఎదుర్కొన్నారు. రేణిగుంట అర్బన్ సీఐగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. అనేక వివాదాల్లో చిక్కుకుని విమర్శలపాలయ్యారు.

ఇప్పుడు శ్రీకాళహస్తిలోనూ ఇదే పరిస్థితి. శ్రీకాళహస్తి ఆలయంలో పలువురిపైనా దాడి చేశారు. ఇటీవలే హోటల్ నిర్వహకురాలు ధనలక్ష్మి పట్ల అంజుయాదవ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మహిళ అన్న విచక్షణ మరిచి దురుసుగా వ్యవహరించారు. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు జగన్‌ సర్కారు. అంతేకాదు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉషాపై కూడా ఇదే విధంగా వ్యహించి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు జనసేన నాయకుడ్ని కొట్టడంతో సీఐ అంజుయాదవ్ తీరు మరోసారి చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story