శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం.. తొమ్మిది మంది ఉద్యోగుల బదిలీ

శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం.. తొమ్మిది మంది ఉద్యోగుల బదిలీ
ఆరోపణల పర్వం నేపథ్యంలో ఆలయ పాలక మండలి తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై ఇప్పటికే దుమారం చెలరేగగా.. తాజాగా ఇతర మతస్థులకు దుకాణాల కేటాయింపు కూడా వివాదాస్పదమైంది. మాంసం సరఫరా.. మద్యం అమ్మకాలు.. కాంట్రాక్టు సిబ్బంది నియామకాలు.. తాజాగా పార్కింగ్ స్థలాల్లోనూ షాపులు కేటాయించడం లాంటి అంశాలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అటు, MLA శిల్పా చక్రపాణిరెడ్డి ముఖ్య అనుచరుడు రజాక్ తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇటీవల రాజాక్ అక్రమంగా షాపులను ఏర్పాటు చేయిస్తున్నారన్న విషయం తెలిసి దేవస్థానం అధికారులు అడ్డుకున్నారు. శిల్పా అనుచరుడైన రజాక్ అధికారులతో వాదనకు దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్మే రాజాసింగ్ స్పందిస్తూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర మతస్తులను దేవస్థానం నుంచి పంపించవేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు.

జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. MLA శిల్పాచక్రపాణిరెడ్డి అనుచరుడు, అన్యమతస్థుడు అయిన రజాక్‌కి శ్రీశైలంలో పనేంటని ప్రశ్నించారు. రజాక్ పై చర్యలు తీసుకోకపోతే హిందూ సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఛలో శ్రీశైలం నిర్వహిస్తామని బుడ్డా హెచ్చరించారు. మైనార్టీ ఓట్ల కోసం ఇకనైనా రాజకీయాలు చేయడం మానుకోవాలని శిల్పాకు హితవు పలికారు.

11 కోట్ల రూపాయలతో నిర్మించిన లాలితాంబ షాపింగ్ కాంప్లెక్స్ కేసు వివాదం కోర్టులో ఉండగానే, కొందరు వైసీపీ నాయకులు యధేచ్చగా అక్కడి షాపుల తాళాలు తీసి గోడౌన్లుగా వాడేసుకుంటున్నారు. అయితే దేవస్థానంలో అన్యమతస్థుల షాప్‌లు తొలగించేందుకు నోటీసులు ఇచ్చామంటున్నారు EO కేఎస్ రామారావు. ఈ విషయంలో కోర్టులో కేసు ఉంది కాబట్టి తుది తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఆరోపణల పర్వం నేపథ్యంలో ఆలయ పాలక మండలి తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


Tags

Read MoreRead Less
Next Story