ఏపీలో మండుతున్న ఎండలు

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేశాయి. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత వాతావరణం చల్లబడుతుందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇవాల్టికి మధ్య అరేబియా సముద్రంలో పలు ప్రాంతాలకు, కేరళలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇంకా తమిళనాడు, కర్ణాటకల్లో కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు, ఈశాన్య భారతంలో కొన్ని భాగాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలో కొన్ని ప్రాంతాలకు రెండు రోజుల్లో రుతు పవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.
మరోవైపు మయన్మార్ తీరానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ఇది భారత భూభాగానికి దూరంగా ఉన్నందున నైరుతి రుతుపవనాల పురోగతిపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. కాగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాన్ ‘బిపర్జాయ్ ఉత్తర ఈశాన్యంగా పయనించి సాయంత్రానికి గోవాకు 740 కిలోమీటర్లు పశ్చిమంగా కేంద్రీకృతమై ఉంది. ఇది అక్కడ నుంచి ఉత్తర ఈశాన్యంగా తరువాత వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com