Supreme Court : లడ్డూపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం ఆదేశాలు.. కమిటీలో ఐదుగురు ఎవరంటే?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సూపర్‌విజన్‌లో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. సిట్ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకముందని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించగా... స్వతంత్ర దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైవీ సుబ్బారెడ్డి తరపున వాదించిన కపిల్ సిబల్ పేర్కొన్నారు. దాంతో ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతోపాటు ఒకరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండనున్నారు.
తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని.. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com